Telangana: సినిమా అవార్డుల జ్యూరీ మెంబర్స్ వీరే...
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:13 PM
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్ పర్సన్ గా జయసుధ వ్యవహరిస్తుండగా, పద్నాలుగు మంది సభ్యుల కమిటీ అవార్డులకు అర్హులను చేయనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎట్టి పరిస్థితుల్లో గద్దర్ ఫిల్మ్ అవార్డులను వీలైనంత త్వరగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసం టి.జి. ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా 'దిల్' రాజు (Dil Raju) ను నియమించడంతో పాటు ఈ అవార్డుల విధి విధానాలను ఖరారు చేసే బాధ్యతను ప్రముఖ దర్శకులు 'దాసి' నరసింగరావు టీమ్ కు అప్పగించారు. వారు సంతృప్తికరంగా నివేదికను సమర్పించడంతో, గద్దర్ ఫిల్మ్ (Gaddar) అవార్డుల విషయంలో మరో కీలకమైన అడుగు పడింది. ఇప్పటికే గద్దర్ ఫిల్మ్ అవార్డులను 2024 నుండి ఇవ్వాలనే నిర్ణయం జరిగిపోయింది. అలానే 2014 నుండి 2023 వరకూ యేడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయాలనే నిర్ణయించారు.
ఇదిలా ఉంటే... బుధవారం 2024 అవార్డులకు సంబంధించి జ్యూరీ సభ్యుల సమావేశం జరిగింది. జ్యూరీ ఛైర్ పర్సన్ గా జయసుధ (Jayasudha) వ్యవహరిస్తారని టీజీ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇక కమిటీ సభ్యులుగా జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) (నటి, దర్శకురాలు), కె. దశరథ్ (దర్శకుడు), బి.వి. నందినీ రెడ్డి (దర్శకురాలు), ఇ. విజయ్ కుమార్ రావు (ఎగ్జిబిటర్), లక్ష్మీనారాయణ (జర్నలిస్ట్), ఎల్. శ్రీనాథ్ (దర్శకుడు), డా. ఆకునూర్ గౌతమ్ (ఫిల్మ్ అనలిస్ట్), కాసర్ల శ్యామ్ (గీత రచయిత), సి. ఉమా మహేశ్వరరావు (దర్శకుడు), శివనాగేశ్వరరావు (దర్శకుడు), వి.ఎన్. ఆదిత్య (దర్శకుడు), జి. వెంకట రమణ (జర్నలిస్ట్), ఏడిద రాజా (నిర్మాత) ఉన్నారు. అలానే టి.జి.ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ ఈ జ్యూరీ సభ్యుడిగా ఉండటంతో పాటు కన్వినర్ గా వ్యవహరిస్తారు.
Also Read: Sunny Deol: త్వరలో సెట్స్ పైకి జాట్ - 2
Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి