Prabhas: ఫౌజీ హీరోయిన్ కెరీర్ పై నీలినీడలు...

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:37 PM

పహల్గామ్ ఉదంతంతో పాకిస్తాన్ నటీనటులపై భారతీయులు దృష్టి పెట్టారు. అక్కడి వారిని ప్రోత్సహించకూడదని కోరుతున్నారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ కెరీర్ పైనా నీలినీడలు అలముకున్నాయి.

పహల్గామ్ (Pahalgam) లో ముస్లిం ఉగ్రవాదులు తెగబడి హిందూ పర్యాటకులను హతమార్చడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి మరోసారి పాకిస్తాన్ వైపు మళ్ళింది. పాకిస్తాన్ కు ఎన్ని రకాలుగా బుద్ది చెప్పినా... కుక్కతోక వంకర తరహాలో భారత దేశంపై ఉగ్రదాడులకు అక్కడి సంస్థలను పురిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టుగా ఇప్పుడు కొందరి దృష్టి పాకిస్తాన్ కు చెందిన నటీనటుల మీద పడింది. అక్కడి నుండి వచ్చిన ఇక్కడి సినిమాలు చేస్తున్న వారి గురించి ఆరా తీస్తూ వారు నటిస్తున్న సినిమాలను చూడవద్దంటూ సోషల్ మీడియాలో బుధవారం ఉదయం నుండి పోస్టులు పెడుతున్నారు. అలా ఇప్పుడు కొందరు ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ఫౌజీ' (Fauji) మూవీనీ టార్గెట్ చేస్తున్నారు.


ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గత యేడాది పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమాను ప్రారంభించింది. 1940 నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో లార్జర్ దేన్ లైఫ్ సీన్స్ తో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో మేకర్స్ తెలిసారు. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడం కోసం పోరాడే యోధుడి కథ ఇదని చెప్పారు. మిధున్ చక్రవర్తి, జయప్రద (jayaprada), అనుపమ్ ఖేర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న హీరోయిన్ ఇమాన్వి (Imanvi) తొలి రోజునే అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ప్రభాస్ సరసన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది.


డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇమాన్వి ఢిల్లీ నివాసి. ఆమె ఉండేది ఢిల్లీలోనే అయినా... ఆమె పుట్టింది పాకిస్తాన్ లో అని, ఆమె తండ్రి అక్కడి ఆర్మీలో ఆఫీసర్ అని తేలింది. ఇమాన్వి అసలు మేరు ఇమాన్ ఇస్మాయిల్... అయితే స్క్రీన్ నేమ్ ను ఇమాన్విగా మార్చుకుంది. బేసికల్ గా డాన్సర్ అయిన ఇమాన్వి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పహల్గామ్ ఉదంతం జరిగిందో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. కొందరు ఆమెను హీరోయిన్ గా తీసుకున్న 'ఫౌజీ'ని బాయ్ కాట్ చేయాలని అంటుంటే... ఇకపై ఇమాన్వి కి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకూడదని, పాకిస్తాన్ నటీనటులను ప్రోత్సహించకూడదని మరికొందరు అంటున్నారు. నిజానికి 'ఫౌజీ' సినిమా విడుదలకు ఇంకా చాలానే సమయం ఉంది. అప్పటికి ఈ వేడి పూర్తిగా చల్లారిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనవచ్చు. అందరూ ఈ అంశాన్ని మర్చిపోయే అవకాశం కూడా లేకపోలేదు.

Also Read: Kiran Korrapati: గని దర్శకుడి హిందీ సినిమా...

Also Read: Pahalgam: పాకిస్తానీ హీరో చిత్రానికి బాయ్ కాట్ సెగ...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 23 , 2025 | 05:37 PM