Krishna Vamsi: కృష్ణవంశీ డైరెక్షన్ లో అల్లూరి సీతారామరాజు

ABN , Publish Date - Mar 25 , 2025 | 10:17 AM

ఇటీవల రంగమార్తాండ చిత్రంతో మరోసారి ప్రేకకుల ముందుకొచ్చారు కృష్ణవంశీ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జీవిత గాథ నేపథ్యంలో సినిమా చేయాలన్నది తన కోరిక అని చెప్పారు కృష్ణవంశీ.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) మనసు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) బయోపిక్ మీదకు పోయింది. గతంలో ఆయన 'వందేమాతరం' (Vandemataram) పేరుతో ఓ భారీ దేశభక్తి చిత్రాన్ని చిరంజీవి (Chiranjeevi) తో తీయాలని తపించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలానే బాలకృష్ణ (Balakrishna) తోనూ 'రైతు' అనే సినిమాను ప్లాన్ చేశారు. అదీ పట్టాలెక్కలేదు. అయితే... ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలన్నది తన ఆలోచనగా కృష్ణవంశీ తెలియచేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) తో కలిసి కృష్ణవంశీ, అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి సోమవారం వెళ్ళారు. అక్కడ అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులను వారు సందర్శించారు.


WhatsApp Image 2025-03-25 at 12.22.07 PM.jpeg

అక్కడ కొంతసేపు గడిపిన కృష్ణవంశీ మాట్లాడుతూ, 'అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను సందర్శించాలనే చిరకాల కోరిక ఇప్పుడు తీరింద'ని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన 'ఆకుపచ్చ సూర్యోదయం' పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని, దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఆయన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను గ్రంధస్థం చేశారని కృష్ణవంశీ చెప్పారు. దానిని చదివిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి తిరిగిన ప్రదేశాలను చూడాలనే కోరిక మరింత బలపడిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని బేస్ చేసుకుని ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన తనకు ఎంతోకాలంగా ఉందని, దానికి సంబంధించిన పని కొంత కాలంగా చేస్తున్నానని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ గురించి యండమూరి మాట్లాడుతూ, 'దేశభక్తిని పెంపొందించే చిత్రాల దర్శకుడిగా కృష్ణవంశీ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన తీసిన'ఖడ్గం' మూవీ తనకెంతో ఇష్టమ'ని చెప్పారు.


WhatsApp Image 2025-03-25 at 12.22.08 PM.jpeg

కృష్ణవంశీ అల్లూరి బయోపిక్ గురించి తన మనసులో మాట చెప్పగానే చాలామంది దీనిని ఎవరితో ఆయన చేస్తారా అనే ఆలోచన మొదలు పెట్టారు. చిరంజీవితో 'వందేమాతరం' చేయలేక పోయిన కృష్ణవంశీ దానిని రామ్ చరణ్ (Ram Charan) తో అయినా చేయాలని అనుకున్నారు. అయితే... చెర్రీతో 'గోవిందుడు అందరివాడేలే' మూవీ చేశారు కృష్ణవంశీ. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా... చిత్రబృందానికి మంచి పేరే తెచ్చిపెట్టింది. మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఫిల్మ్ మేకర్స్ గా కృష్ణవంశీ అంటే ఇప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్ కు అభిమానమే. ఇటీవల 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించి మెప్పించిన రామ్ చరణ్.. కృష్ణవంశీ తెరకెక్కించబోయే అల్లూరి సీతారామరాజులో నటిస్తే బాగుంటుందని మెగాభిమానులు భావిస్తున్నారు. మరి అల్లూరి సీతారామరాజుగా కృష్ణవంశీ మనసులో ఎవరు ఉన్నారు? ఈ సినిమా ఎప్పుడు? ఎలా? ఎవరి ద్వారా సెట్స్ మీదకు వెళుతుంది అనేది వేచి చూడాలి.

Also Read: NBK Vs Raviteja: మరోసారి బరిలో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 25 , 2025 | 01:04 PM