Raja Markandeya: ‘కన్నప్ప’కి పోటీగా.. కలియుగ మార్కండేయుని కథ!
ABN , Publish Date - Jan 28 , 2025 | 08:38 PM
ఒకవైపు మంచు విష్ణు ‘కన్నప్ప’ అంటూ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంటే.. మరో వైపు ‘రాజా మార్కండేయ’ అంటూ మరో శివ భక్తుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ నిర్మాతలు. ‘రాజా మార్కండేయ’ చిత్ర వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో ఇప్పుడు శివ భక్తులపై సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మంచు విష్ణు ‘కన్నప్ప’ అంటూ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంటే.. శివుని భక్తుడైన మార్కండేయుడు కలియుగంలో ఉంటే.. అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘రాజా మార్కండేయ’. ‘వేట మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌరిశెట్టి శ్రీనివాస్, బన్నీ అశ్వంత్ కో ప్రొడ్యూసర్స్. యస్ కె మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు, సత్యదీప్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, వంటి వారితో పాటు చిత్రయూనిట్ అంతా పాల్గింది. చిత్రంలోని ఒక్కో పాటను హాజరైన అతిధులు ఆవిష్కరించగా.. టీజర్‌ను రాపోలు భాస్కర్ విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను హీరో సుమన్ రిలీజ్ చేశారు.
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ప్రస్తుతం శివ భక్తులు ట్రెండ్ నడుస్తుంది. ‘రాజా మార్కండేయ’ సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతుంది. అందరూ కొత్తవాళ్ళైనా సినిమాలో మంచి కథ వుందనేది తెలుస్తుంది. ఇలాంటి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. చిత్రంలో శివయ్య పాట చాలా అద్భుతంగా ఉంది. రాబోయే శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ పాట మార్మోగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి లాభాలు రావాలి" అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు బన్నీ మా సభ్యుడే. చాలా టాలెంట్ వున్న వ్యక్తి. నిర్మాతలు మా జిల్లాకు చెందినవారు. అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. సాంగ్స్ ట్రైలర్ అద్భుతం వున్నాయి. డెఫినెట్‌గా ఈ సినిమా హిట్ అవుతుందని అన్నారు.
దర్శకుడు బన్నీ ఆశ్వంత్ మాట్లాడుతూ.. ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా తీయాలనేది నా కల. నాకు సహకరించి ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు. అందరూ ఎంతో కోపరేట్ చేశారు. లైఫ్ లాంగ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. నిర్మాతల్లో ఒకరైన సామా శ్రీధర్ మాట్లాడుతూ.. మా బన్నీ అశ్వంత్ వల్లే ఈ సినిమాని నిర్మించగలిగాం. కథని నమ్ముకొని తీసిన సినిమా ఇది. అందరూ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వారందరికీ స్పెషల్ థాంక్స్. హాజరైన అతిథులందరికీ ధన్యవాదాలని అన్నారు. సంగీత దర్శకులు, హీరోహీరోయిన్లు.. ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.