Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గా మెగాస్టార్
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:12 PM
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో హీరో పాత్ర పేరు శంకర్ వర ప్రసాద్ అని తెలిసింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipoodi) సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. స్వయంగా ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి విప్పీ విప్పనట్టుగా, చెప్పీ చెప్పనట్టుగా ఓ అప్ డేట్ ను ఎక్స్ వేదికగా వెల్లడించాడు. చిరంజీవితో తాను తెరకెక్కించబోతున్న సినిమాలోని 'శంకర్ వర ప్రసాద్' పాత్రను చిరంజీవిగారికి పరిచయం చేశానని, ఆయన దానిని ఎంతో ప్రేమిస్తూ ఎంజాయ్ చేశారని అనిల్ పేర్కొన్నాడు. ఇంకెందుకు లేటు... వెంటనే సెట్స్ కి వెళ్ళిపోదాం అని చిరంజీవి సలహా ఇచ్చినట్టుగా అనిల్ తెలిపాడు. నిజానికి చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్. అయితే ఇంట్లో వాళ్ళు ముద్దుగా ఆయన్ని శంకరం బాబు అనిపిలుస్తుంటారు. సో... ఓ రకంగా చిరంజీవి ఒరిజినల్ పేరునే ఇందులోని ఆయన పాత్రకు అనిల్ రావిపూడి పెట్టేశాడన్న మాట!
ఈ సినిమా ఉగాది రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోబోతోందని ఇప్పటికే వార్తలు ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, అక్టోబర్, నవంబర్ మాసాలకు గుమ్మడికాయ కొట్టేస్తారు. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసి, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అదే విషయాన్ని అనిల్ రావిపూడి సైతం ఈ ఎక్స్ పోస్ట్ లో తెలిపాడు. 'చిరు' నవ్వుల పండగ బొమ్మకు శ్రీకారం అని పేర్కొన్నాడు. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వే లో సాగే ఈ సినిమాను సంక్రాంతి పండగకు రిలీజ్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పాడు అనిల్.
రచయితగా పలు సక్సెస్ మూవీస్ చేసిన అనిల్ రావిపూడి 'పటాస్' చిత్రంతో దర్శకుడిగా మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి నుండి వెనుతిరిగి చూడకుండా వరస విజయాలను అందుకుంటున్నాడు. యువ కథానాయకులతోనే కాదు... స్టార్ హీరోలను సైతం తాను డీల్ చేయగలనని 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ తో అనిల్ రావిపూడి నిరూపించాడు. అలానే సీనియర్ స్టార్స్ అయిన బాలకృష్ణ (Balakrishna), వెంకటేశ్ (Venkatesh) తోనూ సూపర్ హిట్ లను అందుకున్నాడు. అనిల్ లోని ఈ ప్రతిభను గుర్తించే మెగాస్టార్ అవకాశం ఇచ్చారని మెగాభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడితో ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నాడు, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కూడా నిర్మాణ భాగస్వామి. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Vijay Devarakonda: రౌడీ హీరో తగ్గాడా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి