Vijay Sethupathi: పూరి, ఛార్మి బలమైన బంధం...

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:07 AM

పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఇకపై సినిమాలు తీయరంటూ కొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అందులో నిజం లేదని తాజాగా వీరు విడుదల చేసిన ఫోటో నిరూపించింది.

డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), అందాలభామ ఛార్మి కౌర్ (Charmme Kaur) కలిసి చిత్రనిర్మాణంలో కొంతకాలంగా ప్రయాణిస్తున్నారు. ఈ రకమైన జర్నీ మొదలై పదేళ్ళు కావస్తోంది. 2015లో ఛార్మితో పూరి జగన్నాథ్‌ 'జ్యోతిలక్ష్మీ' మూవీ చేశాడు. ఆ సినిమాతో ఛార్మి ప్రొడక్షన్ లోకి వచ్చింది. అంతేకాదు... అప్పటి నుండి పూరితో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. పూరి కనెక్ట్స్ (Puri Connects) బాధ్యతలను సైతం తన భుజానికెత్తుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఛార్మి తెలివైన నిర్ణయం తీసుకుందనే చాలామంది అనుకున్నారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి రిలేషన్ గురించి రకరకాల పుకార్లు షికారు చేసినా ఏ రోజునా అటు పూరి, ఇటు ఛార్మి స్పందించలేదు. సినిమాల నిర్మాణంలో తనకు ఛార్మి ఎంతో హెల్ప్ ఫుల్ గా ఉందని పూరి చెబితే, పూరి జగన్నాథ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను నిర్మాణపరమైన వ్యవహారాలను సజావుగా నిర్వహిస్తున్నానని ఛార్మి తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' (ismart Shankar) ఘనవిజయం సాధించింది. అప్పటికే కొంతకాలంగా వరుస పరాజయాలతో కృంగిపోయి ఉన్న పూరికి ఈ విజయం గొప్ప రిలీఫ్‌ ను ఇచ్చింది. ఛార్మి సైతం ఆ సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత కన్నీటిపర్యంతమైంది. తమకింకా మంచి రోజులు రాబోతున్నాయని తెలిపింది. కానీ మళ్ళీ కథే మొదలైంది.


'ఇస్మార్ట్ శంకర్' తర్వాత పూరి జగన్నాథ్‌, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' (Liger) దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో పూరి, ఛార్మి చేశారంటూ వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండతో మొదలెట్టిన 'జనగణమన' (Janaganamana) సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. తిరిగి రామ్ తోనే పూరి, ఛార్మి చేసిన 'డబుల్ ఇస్మార్ట్' సైతం ఘోర పరాజయాన్ని పొందింది. ఈ నేపథ్యంలో పూరి, ఛార్మికి మధ్య చెడిందని, పూరి జగన్నాథ్‌ ఛార్మిని దూరం పెట్టేశారని, అతని ప్రొడక్షన్ హౌస్ లో ఛార్మి ఇక భాగస్వామి కాదని ఫిల్మ్ నగర్ లో చెప్పుకున్నారు. అయితే... పూరితో తన అనుబంధం జయాపజయాలతో కూడింది కాదని ఛార్మి చెప్పకనే చెప్పింది. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవనే విషయాన్ని తాజాగా విడుదల చేసిన కొత్త సినిమా ప్రకటనతో ఇద్దరూ నిరూపించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో పూరి జగన్నాథ్‌ ఓ మూవీ చేయబోతున్నారన్న వార్త కొద్ది రోజుల క్రితం లీక్ అయ్యింది. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. విజయ్ సేతుపతి కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మి కలిసి ఉన్న ఫోటోనే మీడియాకు విడుదల చేశారు. ఈ కొత్త సినిమాకు పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సో... తనపై వచ్చిన రూమర్స్ కు ఛార్మి ఈ ఫోటోతో సైలెంట్ గా బదులిచ్చేసింది. మరి విజయ్ సేతుపతి మూవీ పూరి, ఛార్మిలకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందో లేదో చూడాలి.

Also Read: Rashmika Mandanna: నిరాశకు గురిచేసిన 'సికందర్' మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 31 , 2025 | 11:59 AM