Celebrities Reactions: మానవత్వానికే మాయని మచ్చ
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:19 AM
పహల్గాం ఉగ్రదాడిపై చిత్ర పరిశ్రమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, హేయమైన ఈ చర్యను ఖండించారు
పహల్గాం ఉగ్ర దాడిపై చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనను ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
అమాయక ప్రజలు, పర్యాటకులను బలిగొన్న భయంకరమైన, హృదయ విదారకమైన దాడి ఇది. ఘటన జరిగిన తీరు గురించి తెలుసుకుంటుంటే మనసు వికలమైంది. క్షమించరాని క్రూరమైన చర్య ఇది. బరువెక్కిన హృదయంతో మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి జరిగిన నష్టం పూడ్చలేనిది.
- చిరంజీవి
ఉగ్రదాడి హేయం... అణచడమే మన ధ్యేయం. వికృత చర్యలపై విక్రమిద్దాం... కశ్మీరం మనదే సదా... పోరాడుదాం పద... అసువులు బాసిన అమాయక పౌరులందరికీ నా అశ్రునివాళి!
- నందమూరి బాలకృష్ణ
పహల్గాం దాడి ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలబడదాం. ఇలాంటి దాడుల ద్వారా దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరు. మనసాయుధ దళాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కలసికట్టుగా ఈ కష్టకాలాన్ని అధిగమిద్దాం. జనసేన పార్టీ మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంది. మా పార్టీ జెండాను అవనతం చేస్తున్నాం.
- పవన్ కల్యాణ్
ఇది చీకటి రోజు. పహల్గాం దాడి ఘటనతో చాలా బాధపడ్డాను. క్రూరత్వానికి వ్యతిరేకంగా కలసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ఈ విషాదం నుంచి బయటపడే శక్తి లభించాలి.
- మహేశ్‌బాబు
పహల్గాం ఉగ్రదాడి తీవ్రంగా బాధించింది. ఇలాంటి ఘటనలకు మన సమాజంలో స్థానం లేదు. బాధిత కుటుంబాలను చూస్తుంటే హృదయం బరువెక్కుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
- ఎన్టీఆర్
పహల్గాం ఘటన గురించి నాలో చెలరేగిన బాధను, కోపాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మనమంతా ఒక్కటిగా నిలిచి ఇలాంటి హేయమైన చర్యలకు వ్యతిరేకంగా పోరాడుదాం.
- షారూఖ్‌ఖాన్
భూతల స్వర్గం కశ్మీర్, తీవ్రవాద చర్యలతో నరకంగా మారుతోంది. వారికి అమాయక ప్రజలు లక్ష్యంగా మారుతున్నారు. అమాయకుల ప్రాణాలు హరించడం హేయమైన చర్య.
- సల్మాన్‌ఖాన్
ఇది క్షమార్హం కాని నేరం. ఈ ఉగ్రచర్యపై అందరూ మౌనం వీడాలి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. తగిన విధంగా బుద్ధి చెప్పాలి.
- సంజయ్‌దత్