హృదయం ఆనందంతో నిండిపోయింది

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:39 AM

మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. బుధవారం యూకే పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో ఆయనకు ఘన సన్మానం జరిగింది. బ్రిడ్జి ఇండియా సంస్థ ఆయనకు..

మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. బుధవారం యూకే పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో ఆయనకు ఘన సన్మానం జరిగింది. బ్రిడ్జి ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందించింది. తనకు దక్కిన ఈ సత్కారానికి హృదయమంతా ఆనందంతో నిండిపోయిందని చిరు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘యూకేలో నాకు దక్కిన ఈ గౌరవం మరిచిపోలేనిది. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలట్లేదు. హృదయమంతా ఆనందంతో ఉప్పొంగిపోతోంది. నాకు సన్మానం చేసిన యూకే పార్లమెంటు సభ్యులకు, జీవిత సాఫల్య పురస్కారం అందించిన బ్రిడ్జి ఇండియా సంస్థకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.చిరంజీవికి ఈ పురస్కారం దక్కినందుకు ఏపీ డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని తెలిపారు.


అలాంటి పనులకు నేను వ్యతిరేకిని

యూకేలో తనను కలవడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారంపై చిరంజీవి స్పందిస్తూ అది అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘లండన్‌లో నన్ను కలవాలనుకుంటున్న ప్రియమైన అభిమానులారా.. నన్ను కలిసేందుకు ‘ఫ్యాన్‌ మీటింగ్స్‌’ పేరిట మీ నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఎవరి నుంచైనా ఇలా డబ్బులు వసూలు చేసి ఉంటే తిరిగివచ్చే ఏర్పాటు చేస్తాను. నేను ఇలాంటి పనులకు పూర్తి వ్యతిరేకిని. మన మధ్య ఉండే అపురూపమైన బంధానికి వెలకట్టలేం’’ అని పేర్కొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 02:41 AM