Bollywood Re-Release movies: రీ రిలీజ్‌తో రాబడి
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:20 AM
బాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని పాత చిత్రాలు మొదట్లో నిరాశపరిచినప్పటికీ, ఇప్పుడు థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతున్నాయి
కొంతకాలంగా బాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ అవుతున్న చిత్రాలకు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు వస్తున్నాయి. ఐదారేళ్ల క్రితం విడుదలైన సినిమాలు మొదలుకొని ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన సినిమాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఒరిజినల్ రిలీజ్‌లో బాక్సాఫీసు దగ్గర నిరాశపరిచిన కొన్ని చిత్రాలు రీ రిలీజ్‌లో ఆశ్చర్యపరిచే రీతిలో వసూళ్లను అందుకోవడం విశేషం. ఇప్పటికే పలు పాత చిత్రాలు థియేటర్లలో సందడి చేయగా, మరికొన్ని త్వరలో రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
ప్రేమికుల రోజున పోటీ
కొన్నేళ్లుగా బాలీవుడ్ పాత హిందీ చిత్రాలను ప్రేమికుల రోజున విడుదల చే యడం ట్రెండ్‌గా మారింది. దీపికా పదుకొనే, రణ్‌బీర్‌కపూర్ జంటగా నటించిన ‘యే జవానీ హై దీవాని’ చిత్రం 11 ఏళ్ల క్రితం విడుదలైంది. అప్పట్లోనే రూ. 300 కోట్లకు పైబడి వసూళ్లు సాధించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అలాగే షాహిద్‌కపూర్, కరీనాకపూర్ జంటగా నటించిన ‘జబ్ ఉయ్ మెట్’ చిత్రం, షారూఖ్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’ చిత్రం కూడా కూడా ప్రేమికుల రోజునే విడుదలయి మంచి వసూళ్లను అందుకున్నాయి.
600 స్ర్కీన్లలో రీ రిలీజ్
2004లో షారూఖ్‌ఖాన్, ప్రీతిజింటా జంటగా వచ్చిన ‘వీర్‌జారా’ చిత్రం గొప్ప విజయాన్ని అందుకొంది. ఇప్పటివరకూ నాలుగు సార్లు ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. గతేడాదిలోనే రెండు సార్లు రీ రిలీజ్ చేశారు. తొలుత సెప్టెంబర్ 13న హిందీ బెల్ట్‌లో రీ రిలీజ్ చేశారు. నిర్మాణసంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 12న విదేశాల్లోనే 600 స్ర్కీన్లలో రీ రిలీజ్ చేశారు. సౌదీ అరేబియా, ఓమన్, ఖతార్ దేశాల్లో తొలిసారి ‘వీర్‌జారా’ సినిమాను ప్రదర్శించడం విశేషం. ఈ సినిమా కోసం లతామంగేష్కర్, నారాయణ్ ఆలపించిన గీతాన్ని ఒరిజినల్ రిలీజ్ సమయంలో తొలగించగా, రీ రిలీజ్‌లో ఆ పాటను జోడించారు.
ఫ్లాప్ చిత్రాలూ మెరుస్తున్నాయి
హిట్ చిత్రాలే కాదు, ఫ్లాప్ అయిన కొన్ని పాత చిత్రాలు కూడా రీ రిలీజ్‌లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. త్రిప్తి దిమ్రి, అవినాష్ తివారి జంటగా నటించిన ‘లైలా మజ్ను’ చిత్రం 2018లో విడుదలైంది. ఈ రొమాంటిక్ డ్రామాకు సాజిద్ అలీ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం అప్పట్లో ఓ మోస్తరుగానే ఆడింది. బాగుందనే ప్రశంసలు పొందినా కమర్షియల్‌గా సక్సె్‌సను అందుకోలేదు. ఆ తర్వాత ఓటీటీలో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. రీ రిలీజ్‌లో మాత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. సాజిద్ దర్శకత్వం వహించిన ‘జబ్ ఉయ్ మెట్’ చిత్రం 2011లో విడుదలైంది. అప్పట్లో రూ. 71 కోట్ల వసూళ్లను అందుకుంది. గత ఏడాది మేలో రీ రిలీజ్ చేయగా రూ. 11 కోట్ల వసూళ్లను సాధించింది.
మూడింతల వసూళ్లు
రీ రిలీజ్‌ల్లో అత్యంత సక్సెస్ అయిన సినిమాల్లో ‘తుంబాడ్’ ముందు వరుసలో ఉంది. 2018లో విడుదలైనప్పుడు రూ. 13 కోట్ల వసూళ్లను సాధించింది. గతేడాది సెప్టెంబర్ 13న రీ రిలీజ్ చేయగా ఈ చిత్రం రూ. 31 కోట్ల వసూళ్లను సాధించింది. రీ రిలీజ్‌లోనూ సినిమా పూర్తవగానే ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి రెండో భాగాన్ని మేకర్స్ ప్రకటించారు.
రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లో ‘రాక్‌స్టార్’ కల్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. 2011లో విడుదలైన ఈ చిత్రం ఒరిజినల్ రిలీజ్‌లో రూ. 68 కోట్ల వసూళ్లను సాధించింది. గతేడాది ‘రాక్‌స్టార్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. పెద్ద సినిమాలేవి థియేటర్లలోకి రాకపోవడంతో రాక్‌స్టార్ పంట పడింది. రూ. 10 కోట్ల వసూళ్లను సాధించింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’, ‘రెహనా హై తెరే దిల్ మే’ ‘చెక్‌దే ఇండియా ‘హమ్‌ఆ్‌పకే హై కౌన్’ తదితర చిత్రాలు సైతం రీ రిలీజ్ అయ్యాయి.
ప్రత్యేక సందర్భాల్లో
కరీనాకపూర్ ఖాన్ 25 ఏళ్ల నట జీవితాన్ని పురస్కరించుకొని ‘కరీనాకపూర్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్’ ను నిర్వహించారు. వారం రోజులపాటు హిందీ బెల్ట్‌లోని ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ థియేటర్లలో కరీనాకపూర్ నటించిన పలు చిత్రాలను ప్రదర్శించారు. అలాగే నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ తమ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ‘నోస్టాల్జియా ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకూ పలు చిత్రాలను రీ రిలీజ్ చేసింది.
రీ రిలీజ్ సినిమాలకంటూ ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉన్నారు. పాత స్మృతులను గుర్తు చేసుకొనేందుకు రీ రిలీజ్ సినిమాలు చూస్తున్నవారు కొందరైతే, ఒరిజినల్ రిలీజ్ సమయంలో చిన్న పిల్లలుగా ఉన్న వాళ్లు పెద్దవాళ్లయ్యాక ఆ సినిమా గురించి తెలుసుకోవడానికి, చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే పాత సినిమాలను మాత్రమే మెచ్చేవాళ్లు రీ రిలీజ్ సినిమాలకు ఓటేస్తున్నారు. నిర్మాతలకూ రీ రిలీజ్‌లు కొత్త ఆదాయ వనరుగా మారాయి. అలాగే ఈ ట్రెండ్ నష్టాల్లో నడుస్తున్న థియేటర్లకూ కొంత ఆదాయాన్ని సంపాదించిపెడుతోంది.
‘‘లైలా మజ్ను’ చిత్రానికి ఒరిజినల్ రిలీజ్‌లో మంచి టాక్ వచ్చింది. కానీ ‘తుంబాడ్, అంధాధూన్, బధాయి హో’ చిత్రాల ముందు నిలవలేకపోయింది. తొలివారం రూ. 3 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. సినిమాను వారం తిరక్కుండానే థియెటర్లనుంచి తొలగించారు. కానీ రీ రిలీజ్‌లో ఏకంగా రూ. 9 కోట్ల వసూళ్లను సాధించడం నన్ను ఆశ్చర్యపరిచింది. నిర్మాణ సంస్థలు సినిమా మంచి క్వాలిటీతో రావడానికి ఇంకొంచెం ఖర్చు చేయాలి. మంచి సినిమా తీస్తే ఫస్ట్ రన్‌లో పోయినా సెకండ్ రన్‌లో అయినా సొమ్ము చేసుకోవచ్చు అని మా సినిమా రుజువు చేసింది.
- దర్శకుడు సాజిద్ అలీ