Nayanthara : వామ్మో... అంతనా....

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:38 PM

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నయనతారను ఎంపిక చేసుకోవాలని అనుకున్న మేకర్స్ కు షాక్ కొట్టినంత పని అయ్యింది. దాంతో వేరే హీరోయిన్ కోసం అన్వేషణ మొదలు పెట్టారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipoodi) ఇప్పుడో సినిమా చేస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడనే వార్త వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఏదీ ఇవ్వలేదు. మే నెలాఖరులో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి సరసన 'సైరా' (Sye Raa) చిత్రంలో నటించిన నయనతార... ఆయన నటించిన మరో సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather) లో కీలక పాత్ర పోషించింది. ఆమెను ఈ సినిమా కోసం మేకర్స్ అప్రోచ్ అయ్యారట.


చిరంజీవితో అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలో హీరోయిన్ గా రకరకాల పేర్లను అనుకున్నా... చివరకు నయనతార (Nayantara), అదితీరావ్ హైదరీ (Aditi Rao Hydari) పేర్ల దగ్గర కాస్టింగ్ టీమ్ ఆగిందట. అతి త్వరలో సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమాకు ఈ ఇద్దరు హీరోయిన్లు ఏ మేరకు డేట్స్ అడ్జెస్ట్ చేసేవారో తెలియదు కానీ ఆదిలోనే హంసపాదు పడినట్టు అయ్యిందని అంటున్నారు. తొలుత నయనతారను అప్రోచ్ అయిన టీమ్ కు ఊహించని షాక్ ఎదురైందట. చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, అనిల్ రావిపూడికి ఉన్న ట్రాక్ రికార్డ్ ను కూడా పట్టించుకోకుండా నయనతార ఏకంగా రూ. 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఈ ప్రాజెక్ట్ కు అనిల్ అండ్ టీమ్ హీరోయిన్ కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ను బడ్జెట్ లో రాసుకున్నారట. దానికి మూడు రెట్లు నయన్ అడిగే సరికీ వారికి నోట మాట రాలేదని తెలిసింది. అలానే అదితీరావ్ హైదరీ నటించిన తెలుగు సినిమాల్లో 'సమ్మోహనం' తప్పితే మరే చిత్రమూ చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేదు. దాంతో మేకర్స్ వేరే హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్నారట. అతి త్వరలోనే హీరోయిన్ ను ఫైనలైజ్ చేసి ప్రకటించ బోతున్నారని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

Also Read: Tollywood: హవీష్‌ తో త్రినాథరావు నక్కిన సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 28 , 2025 | 05:58 PM