Nithin: 'తమ్ముడు'తో ఒడ్డుకు చేరతాడా!?
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:14 PM
నితిన్ తాజా చిత్రం 'రాబిన్ హుడ్' పరాజయం పాలు కావడంతో ఇప్పుడీ హీరో తన ఆశలన్నీ రాబోయే సినిమా 'తమ్ముడు' మీదే పెట్టుకున్నాడు.
హీరో నితిన్ (Nithiin) కు ఇంకా కష్టకాలం తీరలేదు. అతని తాజా చిత్రం 'రాబిన్ హుడ్' (Robinhood) సైతం పరాజయం పాలైంది. నిజానికి ఈ సినిమాపై నితిన్ అండ్ కో ఎన్నో ఆశలు పెట్టుకుంది. సినిమా విజయంపై పూర్తి ధీమా ఉండటంతో నితిన్ నాన్ స్టాప్ గా పబ్లిసిటీ చేశాడు. మేకర్స్ ఏ ఛాన్స్ ను వదులుకోకుండా ఇందులో ప్రత్యేక పాత్ర చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) నూ రంగంలోకి దించారు. నితిన్, శ్రీలీల (Sreeleela), డేవిడ్ వార్నర్ ను సినిమా రిలీజ్ కు ముందు మాగ్జిమమ్ వాడేసుకున్నారు. రకరకాల పద్ధతులలో మూవీకి ప్రచారం కల్పించారు. దాంతో సహజంగానే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే... రాబిన్ హుడ్ మూవీ చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇంత రొట్టకొట్టుడు కథను తీసుకుని, మేకర్స్ సక్సెస్ పై అంత ధీమా ఎలా వ్యక్తం చేశారా? అని ఆశ్చర్యపోయారు. పైగా ఈ మధ్య కాలంలో అసలు చెప్పుకో దగ్గ విజయమే లేని నితిన్... ఇలాంటి కథలను ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాడని ఆశ్చర్యపోయారు. ఏదేమైనా ఈ సినిమా నితిన్ ను, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ను నిరాశకు గురిచేసింది. ఓ రకంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని రశ్మిక మంచి పనిచేసిందనీ అనుకున్నవారూ లేకపోలేదు.
ఇప్పుడు నితిన్ తన ఆశలన్నీ త్వరలో రాబోతున్న 'తమ్ముడు' మూవీపై పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ టైటిల్ తో నితిన్ చేస్తున్న ఈ సినిమాను అతనితో 'దిల్' లాంటి సూపర్ హిట్ మూవీ చేసిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 'దిల్' తర్వాత చాలా యేళ్ళకు నితిన్... దిల్ రాజు బ్యానర్ లో 'శ్రీనివాస కళ్యాణం' మూవీ చేశాడు. బట్... ఇది ఆడలేదు. అయినా... 'తమ్ముడు' మూవీని అదే బ్యానర్ లో చేస్తున్నాడు. నానితో 'ఎంసీఎ', పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' మూవీస్ చేసిన శ్రీరామ్ వేణు దీనికి దర్శకుడు. అజనీశ్ లోక్ నాథ్ సంగీత దర్శకుడు. విశేషం ఏమంటే... ఈ సినిమా విడుదల కాకముందే నితిన్.. దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా 'ఎల్లమ్మ' చేయడానికీ రెడీ అయిపోయాడు. ఒకే బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు కాబట్టి... 'తమ్ముడు'ను ఎలాగైనా దిల్ రాజు సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడనే నమ్మకంతో నితిన్ ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: Sikandar Review: సికందర్ మూవీ రివ్యూ
Also Read: Charming Star: శర్వా ఆ రెండు సినిమాలు....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి