Akshaye Khanna: ఔరంగజేబు టాలీవుడ్ ఎంట్రీ

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:12 PM

ప్రముఖ బాలీవుడ్ నటులు తాజాగా టాలీవుడ్ బాట పట్టారు. ఆ జాబితాలో అక్షయ్ ఖన్నా కూడా చేరాడు. 'ఛావా'లో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన అక్షయ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ 'మహాకాళి'లో కీలక పాత్ర చేస్తున్నాడు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఏ పాత్రలో అయినా చక్కగా ఇమిడిపోగలడు. దానికి తాజా ఉదాహరణ 'ఛావా' (Chhaava) మూవీ. జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న 'ఛావా'లో కరుడుగట్టిన మతోన్మాది ఔరంగజేబు (Aurangzeb) పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీగా నటించిన విక్కీ కౌశల్ (Vicky Kaushal) కు ఈ సినిమా ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో.... ఔరంగజేబు గా అండర్ ప్లే చేసిన అక్షయ్ ఖన్నాకు అంతే పేరు వచ్చింది. రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) ఈ సినిమాలో శంభాజీ నటించింది. 'యానిమల్, పుష్ప 2' తర్వాత ఆమెకు హ్యాట్రిక్ ను అందించిన చిత్రం 'ఛావా'. ఇవాళ ఆమె పుట్టిన రోజు కావడం విశేషం.


ఇదే రోజున 'ఛావా'లో ఔరంగజేబుగా నటించిన అక్షయ్ ఖన్నాకు సంబంధించిన ఓ కీలక ప్రకటన వచ్చింది. 'హను-మాన్' (Hanu-Man) చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' (Jai Hanuman)మూవీ తెరకెక్కుతోంది. అందులో హనుమంతుడిగా కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty) నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లో భాగంనే 'జై హనుమాన్' వస్తోంది. అలానే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్శ్ నుండి మరో సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అదే 'మహాకాళి'. ఈ సినిమాను ఆర్.కె.డి. స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ రచన చేస్తున్న ఈ సినిమా ద్వారా పూజ అపర్ణ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. భారతదేశం నుండి వస్తున్న ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఇదని ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను అక్షయ్ ఖన్నా పోషించబోతున్నాడు. ఈ పాత్ర వివరాలను త్వరలోనే రివీల్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాల మిళితంగా తెరకెక్కుతున్న 'మహాకాళి' చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Test Movie: టెస్ట్ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 05 , 2025 | 02:14 PM