RRR: ఏఐ రేపిన రచ్చ... 'ట్రిపుల్ ఆర్'పై మళ్ళీ చర్చ...
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:49 PM
స్టార్ హీరోలు పెద్ద మనసుతో సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటించినా... వారి అభిమానులు మాత్రం ఆ థియేటర్లలో మాటల తూటాలు పేల్చుతూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఉంటారు. ఇలాంటి వివాదం 'ట్రిపుల్ ఆర్' విషయంలో చూశాం. ఇప్పుడు ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏఐ మరోసారి చిచ్చు పెట్టింది.
ప్రపంచ నంబర్ వన్ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) నెలకొల్పిన 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ బోట్ గ్రాక్' (AI bot Grok)రంగంలోకి దిగి నెల కూడా కాలేదు. తెలుగు సినిమాల గురించి భలేగా చెబుతోంది. ముఖ్యంగా రాజమౌళి (Rajamouli) 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీపై ఈ గ్రాక్ చేసిన విశ్లేషణ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. జూనియర్ యన్టీఆర్ (NTR Jr.), రామ్ చరణ్ (Ram Charan) అభిమానుల మధ్య మాత్రం మళ్ళీ చర్చకు తెరతీసిందనే చెప్పాలి.
'ట్రిపుల్ ఆర్' మూవీ 2022 మార్చి 24న రిలీజయింది. భారీ ఓపెనింగ్స్ చూసింది. అప్పట్లో జూనియర్ యన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి 'ట్రిపుల్ ఆర్' తెరతీసింది. అందులో యన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకు రాజమౌళి అన్యాయం చేశాడని ఆరోపించారు. అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా తమ హీరో కంటే యన్టీఆర్ కేరెక్టర్ బాగుండేలా తీశారనీ ఆవేదన చెందారు. అయితే సినిమా రిలీజై సక్సెస్ రూటులో సాగుతున్నసమయంలో అభిమానులు మనసు మార్చుకున్నారు. ఎవరికి వారు తమ హీరోదే పై చేయి అనుకుంటూ ఆనందించారు. 'ట్రిపుల్ ఆర్'లో మెయిన్ ప్లాట్ రామ్ చరణ్ దేనని, యన్టీఆర్ ది సబ్ ప్లాట్ అని చెర్రీ ఫ్యాన్స్ ప్రచారం చేయడం మొదలెట్టారు. అలాగే యన్టీఆర్ అభిమానులు కూడా కథలో ప్రధానాంశం తమ హీరోదేనని, చెర్రీ సైడ్ ట్రాక్ అనీ టముకు వేశారు. ఇలా ఎవరికివారు చెప్పుకుంటూ ఆనందించారు. మొత్తానికి 'ట్రిపుల్ ఆర్' ఆస్కార్ బరిలోనూ ఒరిజినల్ సాంగ్ నామినేషన్ సంపాదించి, అవార్డునూ గెలుచుకోవడంతో అందరూ ఆనందించారు. అయితే 'ట్రిపుల్ ఆర్'లో ఇంతకూ ఎవరిది ప్రధాన పాత్ర అన్న అంశాన్ని 'ఏఐ బోట్ గ్రాక్'కు సంధించగా ఎంతో తెలివిగా 'ట్రిపుల్ ఆర్'ను రూపొందించడంలో రాజమౌళి ఏ తీరున సాగారో వివరిస్తూ ఓ సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఆ జవాబు సోషల్ మీడియాలో భలేగా సాగుతోంది.
ఇంతకూ ఈ కృత్రిమ మేధ సెలవిచ్చింది ఏమిటంటే - మల్లి అనే అమ్మాయిని రక్షించాలి అనుకున్న కొమరం భీమ్ ప్రధాన నాయకుడు, సీతారామరాజు పోలీసు ముసుగులో పోరాటం చేసే కీలక పాత్ర- ఈ రెండు పాత్రలు బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేశాయి. భీమ్ లక్ష్యం మొదటి నుంచీ కథను నడిపిస్తూ సాగుతుందని, దానికి బలం చేకూర్చేలా రామరాజు కథ చోటు చేసుకుందని వివరించింది. ఏఐ అందించిన ఈ సమాధానం యన్టీఆర్ అభిమానులకు ఆనందం పంచవచ్చు. అయితే ఏఐ తెలివిగా భీమ్ పాత్ర కథకు కేంద్రబిందువులా కనిపించినా, దాని చుట్టూ అల్లుకున్న రామరాజు గతం, అందులోని అంశాలు మరింత పట్టు చూపించాయి అంటూ సమాధానమిచ్చింది. ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యమిచ్చారు దర్శకుడు రాజమౌళి అని తెలిపింది. రెండు పాత్రలను దర్శకుడు సమానంగా బ్యాలెన్స్ చేశారనీ ఏఐ చెప్పింది. కృత్రిమ మేధ ఎంతో తెలివిగా ఇచ్చిన సమాధానం మళ్ళీ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. మరి ఏఐ బోట్ గ్రాక్ లేపిన ఈ తెరకు ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.
Also Read: Jyothi Raj: రోత స్టెప్పును రీ-క్రియేట్ చేయొద్దు ప్లీజ్!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి