Balakrishna : ముందే వచ్చేస్తున్న బాలయ్యబాబు సినిమా

ABN , Publish Date - Mar 24 , 2025 | 10:27 AM

బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన 'ఆదిత్య 369' అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడీ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 4న ఈ మూవీ జనం ముందుకొస్తోంది.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 34 ఏళ్ళ క్రితం జూలై 18,‌ 1991న విడుదలైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడీ సినిమా 4కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. సర్వాంగ సుందరంగా సినిమాను తీర్చిదిద్ది ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అయితే... ఇప్పుడు ఓ వారం ముందే 'ఆదిత్య 369'ను విడుదల చేయబోతున్నారు.


WhatsApp Image 2025-03-24 at 10.08.02 AM.jpegఈ విషయాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలియచేస్తూ, “నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇళయరాజా గారి సంగీతం, జంధ్యాల గారి మాటలు, ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్‌ ఛాయాగ్రహణం... ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. బాలీవుడ్ టాప్ విలన్ అమ్రిష్ పురి, ఫేమస్ నటుడు టినూ ఆనంద్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో ఇంకా చాలా హైలైట్స్ వున్నాయి. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ 'ఆదిత్య 369' చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా సరే, వెండితెరపై చూస్తే వచ్చే అనుభూతి వేరు... మ్యాజిక్ వేరు. అందుకే ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ-రిలీజ్‌కి సిద్థం చేశాం. చక్కని థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని అన్నారు.

Also Read: Allu Arjun: రెండు ఆటలు బన్నీవే.. అట్లీ ప్లాన్‌ మామూలుగా లేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 10:27 AM