Annakkili: ఇళయరాజాకు సూర్య తండ్రి బంగారుకానుక!
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:11 PM
సంగీత దర్శకుడు ఇళయరాజా తొలి చిత్రంలో హీరో శివకుమార్. వీరి ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన 'అణ్ణక్కిళి' చిత్రం 205 రోజులు ఆడింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే అనుబంధం కొనసాగుతోంది.
ఈ మధ్యే లండన్ లో సింఫనీ వినిపించి విజయవంతంగా తిరిగి వచ్చారు ఇళయరాజా (Ilaiya Raja). ఆయన తొలి చిత్ర కథానాయకుడు శివకుమార్ (Siva Kumar) ఈ సందర్భంగా ఇళయరాజాకు ఓ బంగారుగొలుసు కానుకగా ఇచ్చారు. శివకుమార్ అంటే మనవాళ్ళకు అంతగా తెలియదేమో. తమిళనాట స్టార్స్ గా సాగుతున్న సూర్య (Suriya), కార్తి (Karthi) తండ్రి శివకుమార్. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన తొలి చిత్రం 'అణ్ణక్కిళి' (Annakkili). 1976 మార్చి 14న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో శివకుమార్ హీరోగా నటించారు. సుజాత నాయికగా కనిపించారు. ఇందులోని ఇళయరాజా స్వరాలు సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'రామచిలక' పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో రంగనాథ్, వాణిశ్రీ నటించారు. తమిళనాట 'అణ్ణక్కిళి' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి దర్శకద్వయం దేవరాజ్- మోహన్ దర్శకత్వం వహించారు. పంజు అరుణాచలం కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన పంపిణీదారులు 'ఆర్ట్ ఫిలిమ్'లాగా ఉందని విడుదల చేయడానికి పెదవి విరిచారు. దాంతో అరుణాచలం ఈ సినిమాను తక్కువకే పంపిణీదారులకు అమ్మేశారు. అయితే విడుదలయ్యాక ఘనవిజయం సాధించింది. కొన్నవారికి కాసుల వర్షం కురిపించింది.
'అణ్ణక్కిళి' సినిమా చాలాబాగుందని, రంగుల్లో తీసి ఉంటే మరింత బాగా ఆడేదని కొన్ని రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా విడుదలైన రోజున అంటే 1976 మార్చి 14న ఉదయం ఆట, మధ్యాహ్నం మ్యాట్నీకి జనం అంతగా లేరట. తరువాత ఫస్ట్ షో నుంచీ జనం బాగా వచ్చారని, మౌత్ టాక్ తోనే సినిమాకు పబ్లిసిటీ లభించిందని హీరో శివకుమార్ ఈ నాటికీ చెబుతుంటారు. ఆ తరువాత ఈ చిత్రం ఏకధాటిగా కోవైలోని ఇరుదయ థియేటర్ లో 205 రోజులు ఆడింది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలచింది. ఈ చిత్ర విజయం తరువాత ఇళయరాజా మరి వెనుతిరిగి చూసుకోలేదు. తొలి సినిమాతోనే తనకు బంపర్ హిట్ అందించిన ఇళయరాజా అంటే శివకుమార్ కు ఎంతో అభిమానం. అందువల్లే తనయుడు సూర్య, కూతురు బృందాతో కలసి ఇళయరాజా దగ్గరకు వెళ్ళి బంగారు గొలుసు ఇచ్చి గౌరవించారు శివకుమార్.
ఇళయరాజా లండన్ లో తన సింఫనీ కార్యక్రమానికి వెళ్ళక ముందే శివకుమార్ చిన్నకొడుకు కార్తి సోషల్ మీడియా వేదికగా ఇళయరాజాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇళయరాజా సంగీతం మరపురాని మధురమని, ఆ సంగీతంతోనే తామున్నామని కార్తి పేర్కొనడం అప్పట్లో అభిమానులకు ఆనందం పంచింది. ఇప్పుడు ఆయన తండ్రి శివకుమార్, అన్న సూర్య, సోదరి బృంద స్వయంగా వెళ్ళి ఇళయరాజాను అభినందించడం మరింతగా ఆకట్టుకుంటోంది.
Also Read: Shalini Pandey: కారవాన్‌లో దుస్తులు మార్చుకుంటుంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి