రెహ్మాన్‌కు అస్వస్థత

ABN , Publish Date - Mar 17 , 2025 | 02:25 AM

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ. ఆర్‌ రెహ్మాన్‌ ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు..

  • చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ. ఆర్‌ రెహ్మాన్‌ ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆయన డిశ్చార్జ్‌ అయ్యారు. డీహైడ్రేషన్‌, గ్యాస్ట్రిక్‌ సమస్య కారణంగా ఆయన ఒకింత అస్వస్థతకు గురవ్వడంతో, ఇందుకోసం చికిత్స తీసుకున్నారని రెహ్మాన్‌ సోదరి రెహానా వెల్లడించారు. ‘డీ హైడ్రేషన్‌, గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ కారణంగా రెహ్మాన్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తర్వాత కోలుకున్నారు. మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించాం’ అని వైద్యులు పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హాస్పిటల్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేసి రెహ్మాన్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మాజీ భార్య అనొద్దు : సైరా బాను

రెహ్మాన్‌ అనారోగ్యానికి గురయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆయన భార్య సైరా బాను స్పందించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, తన గురించి ప్రస్తావించేటపుడు రెహ్మాన్‌ మాజీ భార్య అని పిలవొద్దు అని ఆమె కోరారు. తాము ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందుకే రెహ్మాన్‌కు దూరంగా ఉంటున్నాననీ ఆమె వెల్లడించారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 17 , 2025 | 02:26 AM