ఐఫా అవార్డ్స్.. లాపతా లేడీస్ హవా
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:21 AM
భారత సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇంటర్నేష్నల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం ఆదివారం రాత్రి ముగిసింది. జైపూర్‌లో జరిగిన ఈ 25వ ఐఫా వేడుకల్లో భాగంగా...
భారత సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇంటర్నేష్నల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం ఆదివారం రాత్రి ముగిసింది. జైపూర్‌లో జరిగిన ఈ 25వ ఐఫా వేడుకల్లో భాగంగా తొలిరోజు డిజిటల్ అవార్డులను ప్రదానం చేశారు. వీటిని ఈ ఏడాదే ప్రవేశపెట్టడం విశేషం. వేడుకల్లో చివరి రోజైన ఆదివారం అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫా అవార్డుల విజేతలను ప్రకటించారు. ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీ్‌స’ను అత్యధిక అవార్డుల వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం సహా మరో ఎనిమిది అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ‘కిల్’, ‘భూల్ భూలయ్యా’ చిత్రాలు నిలిచాయి. భారతీయ చలనచిత్రానికి అందించిన అత్యుత్తమ సేవలకు గాను, దర్శకుడు రాకేశ్ రోషన్‌కు ‘అవుట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పేరిట పురస్కారం అందజేశారు. బాలీవుడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకల్లో షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, బాబీ డియోల్, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, కృతీ సనన్ వంటి తారలు ప్రధానాకర్షణగా నిలిచారు.
జోష్ నింపారు
ప్రతీ ఏడాదీ ఐఫా వేడుకల్లో అత్యంత ఆకర్షణీయంగా నిలిచేవి వేదికపై బాలీవుడ్ స్టార్లు వేసే స్టెప్పులే. ఈ ఏడాదీ కనువిందైన స్టెప్పులతో సందడి చేశారు పలు తారలు. షారుఖ్, మాధురీ దీక్షిత్ కలసి ‘దిల్‌తో పాగల్ హై’ సినిమాలోని పాటలకు స్టెప్పులేసి.. ఆ చిత్రంలో వారు పోషించిన ‘రాహుల్- పూజ’ క్యారెక్టర్లను అభిమానులకు గుర్తుచేశారు. అలాగే, తన హిట్ సినిమాల్లోని పలు పాటలకూ హుషారెత్తించే డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు షారుఖ్. ‘భూల్ భూలయ్యా 3’లోని హుక్ స్టెప్‌ను ఎలా వేయాలో కత్రినాకు చూపించారు కార్తీక్ ఆర్యన్. ఆమె వెంటనే ఆ స్టెప్ వేసి అదరగొట్టారు. నటి నోరా ఫతేహి కూడా పలు పాటలకు డ్యాన్స్ చేశారు. ఈ వేడుకలో ఐకానిక్ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్‌కు ఆయన మనవరాలు కరీనా కపూర్ నివాళి అర్పించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజ్‌కపూర్ నటించిన ’శ్రీ 420’ సినిమాలోని ఓ పాటలో ఆయన ధరించిన కాస్ట్యూమ్స్‌నే వేసుకుని కరీనా డ్యాన్స్ చేశారు. అలాగే, ఆయన నటించిన మరికొన్ని చిత్రాల్లోని హిట్ సాంగ్స్‌కూ ఆమె కాలు కదిపారు.
షోలే సినిమా ప్రత్యేక ప్రదర్శన
ఐఫా వేడుకలో భాగంగా బాలీవుడ్ ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘షోలే’ను ఆదివారం రాత్రి జైపూర్‌లోని రాజ్‌మందిర్ సినిమా థియేటర్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ మాట్లాడుతూ ‘‘షోలే’ సినిమాకు ఇంతటి ఆదరణ దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు.. ‘షోలే’ సినిమా 50 ఏళ్లను పూర్తిచేసుకోవడం.. రెండూ ప్రత్యేక సందర్భాలే. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, జైపూర్‌లోని రాజ్ మందిర్ సినిమా థియేటర్ కూడా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. జైపూర్‌కు ఎవరు వచ్చినా ఈ థియేటర్‌ను ఓ టూరిస్ట్ స్పాట్‌లా సందర్శించడం మర్చిపోరు’’ అని చెప్పారు.
విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్
ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)
ఉత్తమ నటి: నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకురాలు: కిరణ్ రావు (లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకుడు (తొలి పరిచయం): కునాల్ కెమ్ము
(మడగాన్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ సహాయనటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయనటి: జాకీ బోడీవాలా (షైతాన్)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం): లక్ష్య లాల్వాని (కిల్)
ఉత్తమ నటి(తొలి పరిచయం): ప్రతిభ (లాపతా లేడీస్)
ఉత్తమ విలన్: రాఘవ్ జాయల్ (కిల్)
ఉత్తమ సంగీత దర్శకుడు: రామ్ సంపత్ (లాపతా లేడీస్)
ఉత్తమ గాయకుడు: జుబిన్ నౌటియల్ (ఆర్టికల్ 370)
ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ (భూల్ భూలయ్య 3)
ఉత్తమ కథ (ఒరిజినల్): బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్)
ఉత్తమ ఎడిటింగ్: జాబిన్ మార్చంట్ (లాపతా లేడీస్)
ఉత్తమ స్ర్కీన్‌ప్లే: స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)
ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే(లాపతా లేడీస్)