Nani Vs Suriya: మే1న మోస్ట్ వయొలెంట్ మూవీస్
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:43 PM
మే 1న రాబోతున్న 'హిట్ -3', సూర్య 'రెట్రో' సినిమాలు మోస్ట్ వయొలెంట్ గా తెరకెక్కినట్టు సమాచారం!
మోస్ట్ వయొలెంట్ మూవీ గా హిందీ సినిమా 'కిల్' (Kill) ను దర్శక నిర్మాతలు ఆ మధ్య ప్రకటించారు. గత యేడాది జులైలో విడుదలైన ఈ సినిమాను హృద్రోగ సమస్యలు ఉన్నవారు చూడకుండా ఉంటే మంచిదనే సూచనలు వినిపించాయి. లక్ష్య, రాఘవ్ జుయల్, తాన్య మానిక్తలా, అభిషేక్ చౌహాన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కిల్' చిత్ర నిర్మాణంలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగం కావడం విశేషం. అయితే అదే యేడాది డిసెంబర్ లో వచ్చిన మలయాళ చిత్రం 'మార్కో' (Marco) దాన్ని మించిపోయింది. భారత దేశంలోనే ఇంతటి వయొలెంట్ మూవీని గతంలో చూడలేదని విమర్శకులు పేర్కొన్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని హనీఫ్ అడేని తెరకెక్కించాడు. మలయాళంలో ఎప్పుడైతే ఈ సినిమాకు ఆదరణ లభించిందో ఆ తర్వాత వారమే వివిధ భాషల్లో ఈ సినిమా డబ్ చేసి రిలీజ్ చేశారు. అలా తెలుగులోనూ 2025 జనవరి 1న ఈ సినిమా విడుదలైంది. అయితే... ఇక్కడ జనాలు ఇందులోని హింసను తట్టుకోలేకపోయారు. మూవీ తెలుగులో ఆడలేదు. కానీ హనీఫ్ మేకింగ్ స్టైల్ నచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు... అతనితో సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 'మార్కో'తో జాతీయ స్థాయిలో హనీఫ్ కు వచ్చిన గుర్తింపుతో అతనితో పాన్ ఇండియా మూవీని తీయాలన్నది దిల్ రాజు అభిలాష.
ఇదిలా ఉంటే... దక్షిణాది స్టార్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్ పై 'కిల్', 'మార్కో' ప్రభావం బాగానే పడినట్టుగా అనిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన 'యానిమల్' సినిమానూ ఈ సందర్భంగా మర్చిపోలేం. 'యానిమల్'లోని హింసను చాలామంది విమర్శించినా సినిమా ఘన విజయం సాధించింది. అలానే పరభాషల సంగతి ఎలా ఉన్నా 'కిల్, మార్కో' ఆ యా భాషల్లో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. సో... వెండితెరపై ఆ స్థాయిలో లేదా దానిని మించిన హింసను జనాలకు చూపించాలని మన మేకర్స్ తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. మే 1న తెలుగువారిని పలుకరించబోతున్న రెండు సినిమాలు ఇదే కోవకు చెందినట్టుగా అనిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన 'హిట్ -3' (Hit-3) ఆ ప్యాట్రన్ లో తెరకెక్కిన సినిమానే అంటున్నారు. బేసికల్ గా ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే అయినా... దానిని డామినేట్ చేసే హింస ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ తో ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. ఇక ఏప్రిల్ 14న రాబోతున్న 'హిట్ 3' ట్రైలర్ కు సంబంధించిన పోస్టర్స్ గమనిస్తే... ఈ సినిమా మీద 'యానిమల్'తో పాటు 'మార్కో' ప్రభావం ఉందనిపిస్తోంది. పైగా కొన్ని పోస్టర్స్ మీద హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్ అనే సందేశాన్ని మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ లభించినట్టుగా తెలుస్తోంది.
నేచురల్ స్టార్ అనే ఇమేజ్ నుండి బయటపడాలని నాని కొంతకాలంగా ఉద్దేశ్యపూర్వకంగానే ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే 'రా అండ్ రగ్గడ్' మూవీ 'దసరా' చేశాడు. అది వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేయడంతో అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ఇప్పుడు 'ది ప్యారడైజ్' చేస్తున్నాడు. భయంకరమైన హింసను ఆ సినిమాలో చూపించబోతున్నట్టు ఆ మధ్య వచ్చి గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది. ఇప్పుడు రాబోయే 'హిట్ 3' కూడా అలాంటిదే అన్నది ఫిల్మ్ నగర్ టాక్. అలానే మే 1న రాబోతున్న తమిళ స్టార్ హీరో సూర్య 'రెట్రో' (Retro) సినిమాలోనూ రక్తపాతానికి కొదవ ఉండదని ఆ మూవీ టీజర్, పోస్టర్స్ చూస్తే అర్థమౌతోంది. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'రెట్రో' మూవీని తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేయబోతోంది. చిత్రం ఏమంటే... డాక్టర్ శైలేష్ కొలను (Dr. Sailesh Kolanu) తెరకెక్కించిన 'హిట్ 3' మూవీకి నాని నిర్మాణ భాగస్వామి కాగా, 'రెట్రో'కు హీరో సూర్య నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
Also Read: Balakrishna : బోయపాటితో చెడిందా!?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి