L2: Empuraan: అభిమన్యు సింగ్ పాత్రపై హిందువుల ఆగ్రహం
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:17 PM
బాలీవుడ్ నటుడు అభిమన్యు సింగ్ 'ఎంపురాన్' మూవీతో మల్లూవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను పోషించిన బజరంగీ పాత్ర ఇప్పుడు హిందువుల ఆగ్రహానికి గురవుతోంది.
అభిమాన్యు సింగ్ (Abhimanyu Singh) తెలుగులో చాలానే చిత్రాల్లో నటించాడు. అయితే మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' (Gabbar Singh) తోనే! పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించిన 'నేను నా రాక్షసి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభిమాన్యు సింగ్... ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) 'రక్త చరిత్ర'లోనూ కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుండి అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇక గత యేడాది వచ్చిన ఎన్టీఆర్ (NTR) 'దేవర' (Devara) కూడా అతనిలోని నటుడిని మరోసారి ఆవిష్కరించింది. ఇక తాజాగా మార్చి 27న విడుదలైన పాన్ ఇండియా మూవీ 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) తో మరోసారి జాతీయ స్థాయిలో అభిమన్యు సింగ్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేసింది. మోహన్ లాల్ (Mohan Lal) కథానాయకుడిగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన 'ఎంపురాన్' మూవీలో అభిమన్యు సింగ్ మెయిన్ విలన్ గా నటించారు. ఇదే అతనికి తొలి మలయాళ చిత్రం. గుజరాత్ లో జరిగిన అల్లర్లలో ముస్లిమ్స్ మానప్రాణాలు తీసే బలరాజ్ పటేల్ అనే కరుడుగట్టిన హిందుత్వ వాదిగా అభిమన్యుసింగ్ నటించాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా అప్పటి ఆ మతోన్మాది ఎలా జాతీయ రాజకీయాల్లో ఆ తర్వాత కీలకనేత బజరంగీగా మారాడు అనేది 'ఎంపురాన్' చిత్రంలో చూపించారు. 'ఎంపురాన్' మూవీ విడుదలైనప్పటి నుండి జాతీయ వాదులు ఈ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు పృథ్వీరాజ్ హిందువులపై తనకున్న ద్వేషాన్ని అభిమన్యు సింగ్ పాత్ర ద్వారా వెల్లడించాడని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే... అభిమన్యు సింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) లోనూ ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ విలన్ మాదిరి కాకుండా 'ఓజీ'లోని తన పాత్ర కొత్తగా ఉంటుందని తెలిపాడు. ఈ పాత్రలో భిన్నమైన షేడ్స్ ఉంటాయని, ఆ పాత్ర ప్రారంభం ఎంత భిన్నంగా ఉంటుందో, ముగింపు కూడా అంతే భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ఈ పాత్రను తెర మీద చూస్తున్న ప్రేక్షకులు కొన్ని సార్లు ద్వేషిస్తారు, మరికొన్ని సార్లు ఇష్టపడతారు అంటూ ఊరిస్తున్నాడు. దర్శకుడు సుజిత్ మంచి విజన్ ఉన్న దర్శకుడని అభిమన్యు సింగ్ కితాబిచ్చాడు. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' తర్వాత మరోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.
అభిమన్యు సింగ్ ఆమీర్ ఖాన్ నిర్మాణంలో రాజ్ కుమార్ సంతోషి రూపొందిస్తున్న 'లాహోర్ 1947'లోనూ నటిస్తున్నాడు. ఈ హిందీ సినిమాలో తాను విభిన్నమైన పాత్ర చేస్తున్నట్టు తెలిపాడు. తెలుగులో తనకు మంచి మంచి పాత్రలు లభించాయని తెలియచేస్తూ, 'ప్రతి సినిమా నాకు కొత్త సినిమానే. నిజానికి నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ప్రతి పాత్రనూ ఛాలెంజ్ గా తీసుకుని చేస్తుంటాను. నటన అనేది ఒకటి రెండు సంవత్సరాలలో నేర్చుకునేది కాదు... దీని కోసం జీవితకాలం కృషి చేయాలి' అని అన్నారు.
Also Read: Mad Square Movie review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి