Chhaava: మోదీ ప్రశంసలపై స్పందించిన విక్కీ కౌశల్..
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:53 PM
విక్కీకౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తంచేశారు.
విక్కీకౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తంచేశారు. తమ చిత్రాన్ని ప్రశంసించిన ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. సంతోషంతో మాటలు రావడం లేదని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఒక చారిత్రక గౌరవం. గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహరాజ్ త్యాగాన్ని కీర్తించడం గర్వించదగిన గొప్ప క్షణం’’ అని పేర్కొన్నారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ‘ఛావా’ చిత్రం గురించి మాట్లాడారు. ‘‘హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబయి కీలక పాత్ర పోషించింది. కొత్త సినిమా ‘ఛావా’ ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుంది. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ శంభాజీ మహరాజ్ వీరత్వాన్ని చిత్ర రూపంలో పరిచయం చేయడం సాధ్యమైంది’’ అని అన్నారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే ఛావా. ఇందులో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్ యాక్టింగ్‌కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. విడుదలైన తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి పలు రాష్ట్రాలు పన్ను రాయితీ కూడా ఇచ్చాయి.