Saif Ali Khan: సైఫ్ కేసులో ట్విస్ట్.. ఆ వాదనలో నిజం లేదా
ABN , Publish Date - Jan 19 , 2025 | 09:49 PM
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ముంబై నివాసంలో దాడికి పాల్పడిన నిందితుడికి ముంబై కోర్టు జనవరి 24వ తేదీ వరకూ పోలీస్ కస్టడీ విధించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టు ముందు ముంబై పోలీసులు హాజరుపరిచారు కానీ..
ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున దొంగతనం కోసం ముంబై బాంద్రా ఏరియాలోని సైఫ్ ఇంట్లోకి అడుగుపెట్టిన నిందితుడు ఆ క్రమంలోనే సైఫ్‌పై పదునైన బ్లేడుతో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. శరీరంపై ఆరు చోట్ల గాయాలైన సైఫ్ ఆ వెంటనే నగరంలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆయనకు శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. నిందితుడి కోసం గాలించిన ముంబై పోలీసులు థానే జిల్లాలోని హీరానందని ఎస్టేట్ వద్ద అతన్ని ఆదివారం ఉదయం పట్టుకున్నారు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మది షరిఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించామన్నారు. అతను బిజాయ్ దాస్‌గా పేరు మార్చుకుని ఇండియాలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఐదు నెలల నుంచి ముంబైలో ఉన్నట్టు చెప్పారు.
సాక్ష్యం లేదు..
కాగా, నిందితుడు బంగ్లాదేశ్ పౌరుడని పోలీసులు చెప్పడాన్ని బిజాయ్ దాస్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తన క్లయింట్ ఆరు నెలల క్రితం ఇక్కడక వచ్చినట్టు పోలీసులు చెప్పిన కథనంలో నిజం లేదని. ఏడేళ్లుగా అతని థానేలో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడని చెప్పారు. ఇది పూర్తిగా 43ఎ ఉల్లంఘన కిందకు వస్తుందని, సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదని తెలిపారు. తన క్లయింట్‌కు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించినట్టు చెప్పారు. ఇదే సమయంలో నిందితుడికి సంబంధించిన నివేదిక 5 రోజుల్లో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించిందని తెలిపారు.