Tamannaah: ఆధ్యాత్మికం... ఐటమ్ సాంగ్... బొమ్మా బొరుసు!

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:06 PM

ఒక్కోసారి అంతే... అదృష్టం ఎలా, ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. తమన్నా విషయంలో మాత్రం ప్రతీసారి అదే జరుగుతోంది. హీరోయిన్ గా ఛాన్సులు తగ్గుతుంటే... ఐటెం సాంగ్స్ వచ్చిపడుతున్నాయి. ఆమెను అవి అనుకోకుండానే అందలం ఎక్కించడంతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా... క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తన గ్లామర్ ట్రీట్ తో ఇప్పటికీ మూవీ లవర్స్ ను అలరిస్తోంది. వెబ్ సీరిస్, సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఈ నెల 17న 'ఓదెల -2' (Odela -2) తో ప్రేక్షకుల ముందుకు రానుంది. డివోషన్ టచ్ ఉన్న ఈ సినిమాలో తమన్నా శివశక్తిగా కనిపించనుంది. 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ ఓటీటీలో విడుదలైన మంచి బజ్ ను క్రియేట్ చేయడంతో 'ఓదెల -2'కు సహజంగానే క్రేజ్ ఏర్పడింది. అయితే... ఈ సీక్వెల్ కు కొత్త క్రేజ్ తమన్నా కారణంగా వచ్చింది. టైలర్ విడుదలైన తర్వాత మూవీ మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. డివోషనల్ హారర్ డ్రామాగా ఉండబోతోందన్న 'ఓదెల -2'కు సెన్సార్ బృందం 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా విజయంపై మేకర్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.


స్పెషల్ సాంగ్స్ తోనూ రచ్చ!

విశేషం ఏమంటే మిల్కీ బ్యూటీ తమన్నా... స్పెషల్ సాంగ్స్ తోనూ రచ్చ చేస్తోంది. ఐటమ్ సాంగ్స్ చేయడం తమన్నాకు కొత్తేమీ కాదు. గతంలో ''అల్లుడు శ్రీను, సరిలేరు నీకెవ్వరు, జై లవకుశ, కేజియఫ్, గని'' తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. అయితే 'జైలర్' (Jailer) లో 'కావాలిరా' సాంగ్ చేసిన తర్వాత వైల్డ్ ఫైర్ గా మారిపోయింది మిల్క్ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 'స్త్రీ -2'లో చేసిన 'ఆజ్ కీ రాత్' సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బ్యూటీ చిందులేసిన స్పెషల్ సాంగ్ మూవీలన్నీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో బ్యూటీ చేత స్పెషల్ సాంగ్ చేయించాలని నిర్మాతలు సెంటిమెంట్ గా పెట్టేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) నటించిన 'రైడ్ -2' (Raid-2) లో తమన్నా చేసిన 'నషా' ఐటమ్ సాంగ్ ఇటీవల విడుదలై సోషల్ మీడియా హీట్ ను పెంచేసింది. నిజానికి ఈ పాట, అందులో తమన్నా వేసిన స్టెప్పులు 'జైలర్, స్త్రీ -2' సినిమాల్లోని పాటలనే తలపిస్తున్నా... మిల్కీ బ్యూటీ అందాలను ఆరబోసిన విధానం మరోసారి కుర్రకారుకు కిక్ ఇచ్చేలా ఉంది. ఇక రజనీకాంత్ (Rajini kanth) - నెల్సన్ కాంబోలో తెరకెక్కుతున్న 'జైలర్ -2' లోనూ తమన్నా ఐటమ్ సాంగ్ ను పెట్టబోతున్నారట. కొద్దిరోజులుగా తమన్నాను ఎరోటిక్ పాత్రలు, డాన్సులలో చూసిన జనాలు 'ఓదెల -2'లోని ఆధ్యాత్మిక పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Also Read: Balakrishna : బోయపాటితో చెడిందా!?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 13 , 2025 | 03:11 PM