Sunil shetty : 'మోకాళ్లపై కూర్చో.. లేదంటే కాల్చేస్తాం’ అన్నారు

ABN , Publish Date - Feb 28 , 2025 | 06:27 PM

‘‘మోకాళ్లపై కూర్చో.. లేదంటే కాల్చేస్తాం’’ అని హెచ్చరించారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నాకు కంగారుగా అనిపించింది- Sunil Shetty


బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Sunil shetty)తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘కాంటే’ (Kaante) సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఒక సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన లుక్‌ చూసి పోలీసులు అపార్థం చేసుకున్నారని చెప్పారు. తుపాకీ గురి పెట్టడంతో భయపడ్డానని సునీల్‌ శెట్టి తెలిపారు.
‘‘సెప్టెంబర్‌ 11, 2001 (9/11)న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగినప్పుడు మేము ‘కాంటే’ షూట్‌ కోసం లాస్‌ ఏంజెలిస్‌ వెళ్లాం. టీవీలో దాడికి సంబంధి?ంచిన విజువల్స్‌ చూసి నాకెంతో బాధగా అనిపించింది. దాడి కారణంగా కొన్నిరోజుల పాటు షూట్‌ నిలిపి వేశాం. తిరిగి చిత్రీకరణ ప్రారంభించిన సమయంలో సెట్‌లో నా రూమ్‌ తాళాలు మర్చిపోయి.. హోటల్‌కు తిరిగి వచ్చాను. ఏం చేయాలో అర్థం కాలేదు. హోటల్‌ సిబ్బంది వద్దకు వెళ్లి.. ‘‘నా రూమ్‌ తాళాలు మర్చిపోయాను. మీ వద్ద డూప్లికేట్‌ తాళాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించాను. అతడు వెంటనే పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని.. నావైపు తుపాకీ గురి పెట్టారు.


‘‘మోకాళ్లపై కూర్చో.. లేదంటే కాల్చేస్తాం’’ అని హెచ్చరించారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నాకు కంగారుగా అనిపించింది. నా చేతులకు బేడీలు వేశారు. ఇదంతా గమనించిన హోటల్‌ మేనేజర్‌ అక్కడికి చేరుకుని నేనొక నటుడినని.. సినిమా షూట్‌ కోసం వచ్చానని పోలీసులకు వివరించాడు. మా ప్రొడక్షన్‌ బృందం కూడా వివరణ ఇచ్చింది. దాంతో వాళ్లు నన్ను వదిలివేశారు. ఆ సమయంలో నేను గడ్డంతో ఉన్నాను. నా లుక్‌ వల్లే ఇది జరిగి ఉండొచ్చు. అదీ కాక.. నేను మాట్లాడిన ఇంగ్లీష్‌ ఆ హోటల్‌ సిబ్బందికి అర్థం కాకపోవడంతో తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు’’ అని సునీల్‌ శెట్టి వివరించారు.  

Updated Date - Feb 28 , 2025 | 06:27 PM