Rashmika Mandanna: నిరాశకు గురిచేసిన 'సికందర్' మూవీ
ABN , Publish Date - Mar 31 , 2025 | 10:33 AM
హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకుపోతున్న రశ్మిక మందణ్ణ జోరును అడ్డుకట్ట వేసింది సల్మాన్ ఖాన్ 'సికందర్' మూవీ. ఆదివారం విడుదలైన ఈ సినిమా గురించి జనాలు పెదవి విరుస్తున్నారు.
స్టార్ హీరోయిన్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) కెరీర్ అప్రతిహతంగా సాగిపోతోంది. వరుస విజయాలతో ముందుకు పోతున్న రశ్మిక కు ఆ మధ్య వచ్చిన 'గుడ్ బై', 'మిషన్ మజ్ను' వంటి సినిమాలు నిరాశకు గురి చేశాయి. అయితే.. 2023 చివరిలో వచ్చిన రణబీర్ కపూర్ 'యానిమల్' (Animal) తో మళ్ళీ ఒక్కసారిగా రశ్మిక మందణ్ణ కెరీర్ ఊపందుకుంది. ఆ తర్వాత యేడాది 2024 డిసెంబర్ లో వచ్చిన 'పుష్ప -2' (Pushpa -2) ఆ యేడాది అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ యేడాది ఫిబ్రవరిలో వచ్చిన 'ఛావా' (Chhaava) సినిమా జాతీయ స్థాయిలో రశ్మిక మందణ్ణకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టేలా చేసింది. ఆ రకంగా రశ్మిక హ్యాట్రిక్ ను సాధించింది. బట్... ఈద్ కానుకగా ఆదివారం విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ 'సికందర్' (Sikandar) ఆమెను తీవ్ర నిరాశకు గురి చేసింది. తమిళ దర్శకుడు ఎ. ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా రెగ్యులర్ ఫిల్మ్ గోయర్స్ ను మాత్రమే కాదు సల్మాన్ ఖాన్ అభిమానులనూ మెప్పించలేకపోయింది.
ఈద్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ గత చిత్రాల స్థాయి ఓపెనింగ్ కూడా 'సికందర్' కు దక్కలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుండి ఎందుకో 'సికందర్'కు పెద్దంత బజ్ క్రియేట్ కాలేదు. దానికి తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ మూవీకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఇదే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. సల్లూభాయ్ గత చిత్రాలు ''బజరంగీ భాయీ జాన్, కిక్, దబాంగ్, టైగర్ జిందా హై, సుల్తాన్, భరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏక్ థా టైగర్, టైగర్ -3'' చిత్రాలకు ఇంతకంటే మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటున్నారు. సల్మాన్ తోటి హీరోలు చాలామంది ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరితే సల్మాన్ మాత్రం ఆ విషయంలో వెనకబడి పోయారంటున్నారు. షారుఖ్ ఖాన్ 'పఠాన్, జవాన్' చిత్రాలతోనూ, రణబీర్ కపూర్ 'యానిమల్'తోనూ, సన్నీ డియోల్ 'గద్దర్ -2'తో, విక్కీ కౌశల్ 'ఛావా' చిత్రంతో రూ. 500 కోట్ల మైలురాయిని దాటేశారు. చివరకు గత యేడాది వచ్చిన హారర్ మూవీ 'స్త్రీ -2' సైతం రూ. 500 కోట్ల కబ్ లో చేరిపోయింది. కానీ సల్మాన్ ఇంకా ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోతున్నారు. విశేషం ఏమంటే రశ్మిక మందణ్ణ ఇప్పటికే ఆ మైలురాయిని మూడు చిత్రాలతో దాటేసింది. ఆమె నటించిన 'యానిమల్, పుష్ప -2, ఛావా' లు రూ. 500 కోట్ల కబ్ల్ లో చోటు సంపాదించుకున్నాయి. కానీ ఇప్పుడీ 'సికందర్' మాత్రం రూ. 500 కోట్ల గ్రాస్ ను దాటడం కష్టమనే అంటున్నారు. ఆదివారంతో పోల్చితే... సోమవారం ఈద్ పండగ సెలవు కాబట్టి కొంత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే పులి మీద పుట్రలా ఇప్పటికే ఈ సినిమా ఆన్ లైన్ లో పైరసీ అయి చక్కర్లు కొడుతోందని బాలీవుడ్ వర్గాలు మొత్తుకుంటున్నాయి.
Also Read: Balakrishna: ఆ పదం మన ఒంటికి పట్టదు.. మొదలు పెడితే, ఆపేది లేదు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి