Shreya ghoshal: చిన్న పిల్లలు ఆ పాటలు పాడటం నచ్చడం లేదు..
ABN , Publish Date - Feb 27 , 2025 | 07:27 PM
ఐటెమ్ సాంగ్స్ (Item Songs) ఆలపించడంపై శ్రేయా ఘోషాల్ స్పందించారు. కొన్ని సంఘటనల తర్వాత అలాంటి పాట విషయంలో తాను ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
శ్రేయా ఘోషాల్ (Shreya ghoshal) పరిచయం అక్కర్లేని గాయని. తన మధురమైన స్వరంలో సంగీత, సినీ ప్రియుల మనసులను గెలుచుకున్నారు. ‘ఆల్ హార్ట్స్ టూర్’లో (All Hearts tour) భాగంగా త్వరలో ఆమె చెన్నైలో లైవ్ కాన్సర్ట్ (live concert) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఐటెమ్ సాంగ్స్ (Item Songs) ఆలపించడంపై ఆమె స్పందించారు. కొన్ని సంఘటనల తర్వాత అలాంటి పాట విషయంలో తాను ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
‘‘చికినీ చమేలీ’ వంటి ఐటెమ్ సాంగ్స్‌ను ఆలపించాను. శృంగారం, అసభ్యత మధ్య ఒక సున్నితమైన గీత ఉంటుంది. అది నాకు తెలుసు. ఆయా పాటల్లోని సారాంశం తెలియనప్పటికీ చాలా మంది చిన్నారులు వాటిని ఆలపించడం చూసిన తర్వాత.. ఇలాంటి పాటల ఎంపికలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా. చిన్నారులు దీనిని ఒక సరదా పాటగా భావిస్తున్నారు. ఆ పాటలకు డాన్స్‌లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు నన్ను కలిసి.. ‘‘మీ పాటలు మాకెంతో ఇష్టం. మీ ఎదుట ఒక పాట పాడాలని ఉంది’’ అంటూ ఆ పాటలనే పాడుతున్నారు. అలా నేను చాలాసార్లు ఇబ్బందిపడ్డాను. ఐదేళ్ల వయసున్న ఒక చిన్నారి ఒకసారి నన్ను కలిసి ‘చికినీ చమేలీ’ పాట పాడింది. ఆ వయసులో చిన్నారి అలాంటి పాటలు పాడటం నాకు ఏ మాత్రం మంచిగా అనిపించలేదు. ఇలాంటి పలు సంఘటనలు ఎదురైన తర్వాత పాటల ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది’’ అని శ్రేయా ఘోషల్ అన్నారు. . చెన్నై వేదికగా మార్చి 1వ తేదీన, కోయంబత్తూర్‌లో మార్చి 15న శ్రేయా మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది.