Sunny Deol: ఆ ఇద్దరు నిర్మాతలకు చెయ్యిచ్చిన సన్నీ డియోల్
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:43 AM
'గదర్ -2' చిత్రంతో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు సన్నీ డియోల్. అయితే ఆ తర్వాత ఆయన ప్రాధాన్యతలు మారిపోయాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
బాలీవుడ్ (Bollywood) లో ఏ హీరో కు ఎప్పుడు టైమ్ వస్తుందో చెప్పడం కష్టం. అగ్ర కథానాయకులుగా రాణించిన వారు... ఒక్కసారిగా తెర మాటుకు వెళ్ళిపోతుంటారు. 'ఇక ఈ హీరో పని అయిపోయింది' అనుకున్న సమయంలో సీనియర్ హీరోలు ఊహించని విజయంతో తెర మీదకు వస్తున్నారు. ప్రస్తుతం సన్నీ డియోల్ (Sunney Deol) పరిస్థితి ఇదే. సన్నీ డియోల్ కు ఇక విజయం దక్కడం కష్టమని అంతా అనుకుంటున్న టైమ్ లో 'గదర్ -2' (Gadar -2) సినిమాతో అమాంతంగా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరి 'సన్నీ ఈజ్ బ్యాక్' అనిపించుకున్నాడు. అయితే 'గదర్ -2' సక్సెస్ తర్వాత సన్నీ డియోల్ ప్రాధాన్యతలు మారిపోయాంటూ కొందరు వాపోతున్నారు. 'గదర్ -2' చిత్రానికి ముందు సన్నీ కొన్ని సినిమాలు అంగీకరించాడు. అందులో ఒకటి 'సూర్య'. ఇది మలయాళ చిత్రం 'జోసఫ్'కు రీమేక్. కమల్ ముకుత్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు ఎనభై శాతం షూటింగ్ అయిపోయింది. కానీ నిర్మాణపరంగా జరిగిన జాప్యంతో ఈ మూవీ వెనక్కి వెళ్ళిపోయి 'గదర్ -2' ముందు కొచ్చింది. 'గదర్ -2' తర్వాత 'సూర్య' ను పూర్తి చేస్తానని సన్నీ చాలా సార్లు చెప్పారు. కారణాలు ఏవైనా... అది మాత్రం జరగలేదు. విశేషం ఏమంటే మలయాళ చిత్రం 'జోసఫ్' ను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగులో దీనిని 'శేఖర్' పేరుతో రాజశేఖర్ రీమేక్ చేయగా, జీవిత డైరెక్ట్ చేసింది. బట్.. మూవీ ఇక్కడ పరాజయం పాలైంది.
సన్నీ డియోల్ పక్కన పెట్టిన మరో ప్రాజెక్ట్ 'బాప్'. ఈ సినిమా కూడా 'గదర్ -2' కంటే ముందుదే! సహజంగా ఏ హీరో నటించిన సినిమా అయినా విడుదలై ఘన విజయం సాధించగానే అతను నటించిన చిత్రాలు పాతవి ఆగిపోయి ఉంటే... ఓ ఊపులో అవీ జనం ముందుకు వచ్చేస్తుంటాయి. కానీ సన్నీ డియోల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. 'బాప్' సినిమాలో సన్నీ తో పాటు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మిధున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందని, ఈ సీనియర్ స్టార్స్ కాంబోలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు అహ్మద్ ఖాన్ చెబుతున్నాడు. కానీ సన్నీ డేట్స్ కేటాయించక పోవడం వల్లే జాప్యం జరుగుతోందని ఆయన వాపోతున్నాడు.
ఇదిలా ఉంటే సన్నీడియోల్ కూడా ఖాళీగా ఏమీ లేడు. ఇటీవలే అతను మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన 'జాట్' (Jaat) మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 10న జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత రాజ్ కుమార్ సంతోషి హిస్టారికల్ డ్రామా 'లాహోర్ 1947' (Lahore 1947) చేయాల్సి ఉంది. అలానే అనురాగ్ సింగ్ 'బోర్డర్ -2' (Border 2) లోనూ సన్నీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ తివారి ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' (Ramayana) లోనూ సన్నీ హనుమంతుడిగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. మరి ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ నడుమ సన్నీ డియోల్ 'సూర్య, బాప్' చిత్రాలకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడు? ఎప్పుడు అవి పూర్తై జనం ముందుకు వస్తాయనేది అనుమానమే!
Also Read: Happy Birthday: మిడిల్ క్లాస్ లవర్ బోయ్ ఆనంద్ దేవరకొండ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి