Kapkapiii: సంగీత్ శివన్ చివరి చిత్రం విడుదలకు సిద్ధం
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:34 PM
తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, సిద్ది ఇద్నాని కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కప్కాపి’(Kapkapiii). గత ఏడాది జూన్‌లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు సంగీత్ శివన్ (Sangeeth Sivan) మృతి చెందడంతో ఆ సమయంలో విడుదల చేయలేక పోయారు.
తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, సిద్ది ఇద్నాని కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కప్కాపి’(Kapkapiii). గత ఏడాది జూన్‌లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు సంగీత్ శివన్ (Sangeeth Sivan) మృతి చెందడంతో ఆ సమయంలో విడుదల చేయలేక పోయారు. చిత్రీకరణ కొంత బ్యాలన్స్ ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. 2023లో మలయాళంలో వచ్చిన ‘రోమాంచం’ సినిమాకు రీమేక్ ఇది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా తెరకెక్కించారు. మే 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో హిందీ ప్రేక్షకులు 'స్త్రీ 2’తో పాటు మరికొన్ని హర్రర్, కామెడీ సినిమాలను ఆదరించారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా రూపొందించారు. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమా క్రేజ్ మరింత పెరిగింది. సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్‌ను టీజర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. హర్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అలరిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటిదాకా సోలో రిలీజ్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఈ సినిమాకు అనుకున్నట్లుగానే పెద్దగా పోటీ లేదని తెలుస్తోంది. మలయాళ సినిమా ఇండస్ర్టీలో దాదాపు పదేళ్ల పాటు వరుసగా సినిమాలు చేశారు సంగీత్ శివన్. ఆ తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. బాలీవుడ్‌లో ఈయన పలు విజయవంతమైన సినిమాలు చేశారు. మలయాళంలో ఈయన చివరగా 2012 సంవత్సరంలో సినిమాను చేశాడు. ఆ సినిమా తర్వాత కూడా హిందీలో పలు సినిమాలు చేశాడు. చనిపోయే ముందు వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు. గత ఏడాది మే 8న మృతి చెందారు. చనిపోయే సమయంలో సినిమాను చేస్తున్నారు. ఆయన మృతి తర్వాత విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.