Salman Khan: టిక్కెట్ రేట్స్ తగ్గించాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:22 PM

టిక్కెట్ రేట్లను పెంచడాన్ని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఒకే విధానం ఉండాలని అంటున్నారు.

హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), డైరెక్టర్ మురుగదాస్ (Muruga Doss) సరైన సక్సెస్ చూసి ఆరేళ్ళు దాటింది. కాబట్టి ఇద్దరూ ఓ భారీ విజయం కోసం తపిస్తూ కలసి చేసిన సినిమా 'సికందర్' (Sikandar). ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 30న జనం ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ ఖాన్ నోటి నుండి వెలువడిన మాటలు సినీజనాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇంతకూ సల్మాన్ భాయ్ ఏమన్నారంటే - కర్ణాటకలో లాగా సినిమా టిక్కెట్స్ రేట్లపై నియంత్రణ ఉండాలన్నదే ఆయన అభిలాష! టాప్ స్టార్స్ కొత్త సినిమా వస్తోందంటే చాలు వెయ్యి రూపాయలకు పైగా టిక్కెట్ రేటు పెట్టేస్తున్నారని, మల్టీప్లెక్స్ లో అయితే ఆ రేటు రెండు వేల రూపాయలు కూడా ఉంటోందని సల్మాన్ గుర్తు చేశారు. ఇలా టిక్కెట్ రేట్స్ పెంచడం వల్ల సినిమాలకు పెద్ద దెబ్బ అని సల్మాన్ అభిప్రాయపడ్డారు. అదే దేశవ్యాప్తంగా టిక్కెట్స్ పై నియంత్రణ ఉంటే ప్రేక్షకులకు సాధారణ రేటులాగే కనిపిస్తుందని, దాంతో సినిమా బాగుంటే రెండు, మూడు సార్లు చూసే అవకాశం ఉందనీ ఆయన అన్నారు.


మన దేశంలో థియేటర్లు తక్కువగా ఉన్నాయనీ సల్మాన్ అంటున్నారు. దేశవ్యాప్తంగా బిగ్ మూవీస్ కేవలం ఆరు వేల థియేటర్లలోనే విడుదలవుతున్నాయని చెప్పారాయన. బిగ్ స్టార్స్ మూవీస్ కోసం మరో ఇరవై వేలకు పైగా థియేటర్స్ అవసరం ఉందనీ సల్మాన్ అన్నారు. ప్రస్తుతం క్లాస్, మాస్ అన్న తేడాలు లేవని మల్టీప్లెక్సుల్లో ఒకే క్లాస్ ఉంటోందని, అక్కడ కూడా జనం ఈలలు, కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కొందరు ఈలలు, కేకలు వింటూ ఎంజాయ్ చేయడానికే థియేటర్స్ కు వస్తున్నారని సల్మాన్ చెప్పారు. అలాంటి వారు మల్టీప్లెక్స్ ల్లోనే కాదు సింగిల్ థియేటర్స్ లోనూ మూవీస్ చూసి వినోదం పొందుతున్నారని, అందుకోసం అదే పనిగా మాస్ ఏరియాస్ కు వెళ్తున్నారనీ గుర్తు చేశారు. బాగానే ఉంది, ప్రతి వారం ఓ బిగ్ స్టార్ మూవీ వచ్చేలా ప్లాన్ చేసినప్పుడే అన్ని వేల థియేటర్స్ అవసరమని జనం అంటున్నారు. పైగా ఇండియాలో టాప్ స్టార్స్ ఏడాదికి ఒకే సినిమాలో నటిస్తున్నప్పుడు అన్ని వేల థియేటర్స్ అవసరమా అన్నదీ ప్రశ్నే!


దేశవ్యాప్తంగా థియేటర్ల సంఖ్య పెంచాలని, టిక్కెట్ రేట్స్ తగ్గించాలని సల్మాన్ కోరుకోవడం బాగానే ఉంది. మరి తారలకే కోట్లాది రూపాయలు పారితోషికం ఇస్తూ పోతున్న నిర్మాతలు బాగుపడాలంటే దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా. మొదటి వారంలోనే టిక్కెట్ రేట్స్ పెంచేస్తే సినిమా ఎలా ఉన్నా, కొన్నవారికి పెద్దగా నష్టం వాటిల్లదు కదా అన్నది పంపిణీదారుల నుండి వినిపిస్తోన్న వాదన. ఏది ఏమైనా సల్మాన్ లాంటి టాప్ స్టార్ 'దేశవ్యాప్తంగా టిక్కెట్ రేట్లపై నియంత్రణ ఉండాలి' అని గళం విప్పారు. మరి ఎందరు స్టార్స్ సల్మాన్ తో కోరస్ పాడతారో చూడాలి. సౌత్ లో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో టాప్ స్టార్స్ మూవీస్ కు టిక్కెట్ రేట్లు తగ్గించే అవకాశం ఉండదని వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగునేలపై స్టార్స్ మూవీస్ కలెక్షన్ల రికార్డుల ముచ్చట చాలానే ఉంది. మరి సల్మాన్ మాటలతో ఎందరు స్టార్స్ ఏకీభవిస్తారో, ఎందరు సినిమా బాగు కోసం పారితోషికం తగ్గించుకుంటారో అనీ సినీజనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Deva: ఓటీటీలోకి పూజాహెగ్డే ముద్దులతో రెచ్చిపోయిన సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 27 , 2025 | 05:25 PM