Saif Ali Khan: ఆటో డ్రైవర్‌కు సైఫ్‌ ఆత్మీయ ఆలింగనం.. డ్రైవర్‌ ఏం చెప్పాడంటే..

ABN , Publish Date - Jan 22 , 2025 | 06:02 PM

ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణాను (Auto Driver Bhajan Singh Rana) సైఫ్‌ కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు అతడిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు


బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. దుండగుడి దాడి అనంతరం ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణాను (Auto Driver Bhajan Singh Rana) సైఫ్‌ కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు అతడిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు (Saif ali khan Hugs to Auto driver). కష్టకాలంలో తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చింది. డ్రైవర్‌ను గుర్తు పెట్టుకుని అతడికి ధన్యవాదాలు చెప్పడాన్ని నెటిజన్లు హర్షిస్తున్నారు. మరోవైపు, సైఫ్‌ తల్లి షర్మిలా ఠాగూర్‌ సైతం డ్రైవర్‌ సాయాన్ని మెచ్చుకున్నారు. సైఫ్‌పై దాడి జరిగిన అనంతరం భజన్‌సింగ్‌ రాణా గురించి వరుస కథనాలు మీడియాలో వచ్చాయి. సమయానికి ఇంట్లో కారు లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో ‘సైఫ్‌కు సాయం చేసింది ఇతడేనంటూ’ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే భజన్‌ సింగ్‌ పలు  ఛానళ్లతో మాట్లాడాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లే సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని అతడు చెప్పాడు. ఆస్పత్రి వద్ద దించిన తర్వాత సైఫ్‌ వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదని తెలిపాడు.

‘‘ఆరోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. నేను ఆటోలో వెళ్తున్న సమయంలో ఒక మహిళ ఖరీదైన నివాసం గేటు ఎదుట నిల్చొని సాయం కోసం చూస్తూ కనిపించింది. అటుగా వెళ్తున్న నన్ను చూసి ఆటో ఆపమని కోరింది. సైఫ్‌ను చూసిన వెంటనే గుర్తు పట్టలేకపోయా. ఆటోలో ఎక్కిన తర్వాత ఆయన సైఫ్‌ అనే విషయాన్ని గ్రహించా. ఆయనతోపాటు చిన్న పిల్లాడు, మరో వ్యక్తి ఆటోలో ఎక్కారు. ఆటో ఇంటి నుంచి బయలుదేరగానే.. ‘ఇంకెంత సమయం పడుతుంది?’ అని సైఫ్‌ నన్ను అడిగారు. సుమారు 10 నిమిషాల్లో మేము ఆస్పత్రికి చేరుకున్నాం. ఆయన ధరించిన తెల్ల కుర్తా ఎరుపు రంగులోకి మారిపోయింది. చాలా రక్తం పోయింది. ఆస్పత్రి వద్ద ఆయన్ని దించాను. రూపాయి కూడా తీసుకోలేదు. అలాంటి సమయంలో ఆయనకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించా. మంగళవారం 3.30 గంటలకు నాకు సైఫ్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. నేను వెళ్లడం ఐదు నిమిషాలు లేట్‌ అయింది. నేను ఇంట్లోకి వెళ్తున్న సమయంలో కుటుంబ సభ్యులంతా బాధాతప్తంగా ఉన్నారు. నన్ను చాలా గౌరవంగా చూశారు. జస్ట్‌ ఆయన్ను కలిసి ుత్వరగా కోలుకోవాలి సర్‌జ ఇంతకుముందు మీ గురించి భగవంతుడిని ప్రార్థించినట్టు ఇప్పుడూ ప్రార్థిస్తాను’ అని ఆయనకు చెప్పాను అని అన్నారు.

 

Updated Date - Jan 22 , 2025 | 06:09 PM