Saif Ali Khan: సీసీటీవీ పుటేజ్ ఏమైంది.. బాడీగార్డ్స్ ఏం చేస్తున్నారు
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:58 PM
Saif Ali Khan: ఈరోజు తెల్లవారు జామున సైఫ్ పై జరిగిన ఎటాక్ లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. వాస్తవానికి సైఫ్ ని ఎటాక్ చేసిన దుండగుడు లోపలికి ఎలా వచ్చాడు అనేది పెద్ద అనుమానం. కాగా, ఆగంతకుడు అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన వీడియో..
ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇంటిలోకి ఒక దుండగుడు ప్రవేశించి ఆయనపై ఎటాక్ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. చిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతమైన పటౌడీ కుటుంబానికి చెందిన ఆయన ఇంట్లో భద్రత వ్యవస్థ ఇంతా బలహీనంగా ఉంటుందా అని షాక్ అవుతున్నారు. ఆశ్చర్యంగా ఈ దాడి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకి రావడంతో జనాలు నోరు వెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గురుగ్రామ్ లో రూ. 800 కోట్ల విలాసవంతమైన ప్యాలస్ కలిగిన సైఫ్.. తన వృత్తిరీత్యా ముంబై, బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్ లో నివాసముంటున్నాడు. అయితే.. ఈరోజు తెల్లవారు జామున సైఫ్ పై జరిగిన ఎటాక్ లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. వాస్తవానికి సైఫ్ ని ఎటాక్ చేసిన దుండగుడు లోపలికి ఎలా వచ్చాడు అనేది పెద్ద అనుమానం. కాగా, ఆగంతకుడు అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన ఒక్క వీడియో కూడా సీసీటీవీ రికార్డ్స్ లో రికార్డ్ కాకపోవడం గమనార్హం. సైఫ్ కి 10 మంది బాడీ గార్డ్స్ తో పాటు మరో ముగ్గురు పర్సనల్ సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఈ వీరందరూ దాడి సమయంలో ఎక్కడికెళ్లారనేది ప్రశ్నగా మారింది. మరోవైపు సైఫ్ భార్య కరీనా ఆ సమయంలో ఇంట్లోనే ఉందా అనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆగంతకుడు మొదట సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు 'జే' గదిలో నక్కాడు, దీనిని గమనించిన 'జే' కేర్ టేకర్ గట్టిగా అరవడంతో సైఫ్ 'జే' గదిలోకి రావడంతో పెనుగులాట జరిగింది. దీంతో సైఫ్ పై 6 కత్తి పోట్లతో దాడి జరిగింది. ఇందులో రెండు తీవ్ర గాయాలు అయ్యాయి. సైఫ్ తో పాటు 'జే' కేర్ టేకర్ కూడా స్వల్పంగా గాయపడింది.మరోవైపు అంతా పెద్ద కుటుంబంలో సమయానికి ఒక్క కారు కూడా లేకపోవడంతో సైఫ్ ని పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఆటోలో తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా ముంబై పోలీసులు ముగ్గురు సైఫ్ సిబ్బందిని విధుల నుండి తొలిగించడం విశేషం.
మరోవైపు ఈ దాడిపై సినీ, రాజకీయ ప్రముఖులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలు నివసించే విలాసవంతమైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని బాంద్రాలోనే కొందరు దారుణంగా కాల్చి చంపారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ హౌస్‌లోనే ఉంటున్నారు. తాజాగా పటౌడీ కుటుంబానికి చెందిన స్టార్ నటుడు సైఫ్‌పై దాడి చేయడంతో.. మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వరస దాడులు జరగడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.