Rohit Shetty: ముంబై పోలీస్ కమీషనర్ గా జాన్ అబ్రహం
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:53 PM
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ముంబై మాజీ కమీషనర్ రాకేశ్ మారియా జీవిత కథను తెరకెక్కించే పనిలో పడ్డాడు. జాన్ అబ్రహం ఇందులో హీరోగా నటించబోతున్నాడు.
బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty) ఇప్పుడో డిఫరెంట్ మూవీని అటెమ్ట్ చేయబోతున్నాడు. ముంబై పోలీస్ కమీషనర్ గా సేవలు అందించిన రాకేశ్ మారియా (Rakesh Maria) జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఈ సినిమాలో రాకేశ్ మారియా పాత్రను జాన్ అబ్రహం (John Abraham) పోషించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. విశేషం ఏమంటే.... ఈ సినిమాను స్టార్ట్ టూ ఫినిష్ పద్థతిలో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తాడట. కేవలం 45 రోజుల్లో దీనిని పూర్తి చేస్తాడట. ఓ రకంగా రోహిత్ శెట్టి కెరీర్ లో అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న సినిమా ఇదే అవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
రాకేశ్ మారియా 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసు (1993 blasts in Mumbai), నవంబర్ 26, 2008లో ముంబైలో జరిగిన టెర్రరిస్టుల అటాక్ కేసు విచారణలో కీలక పాత్ర పోషించారు. తన సర్వీస్ కు సంబంధించిన విశేషాలతో 'లెట్ మీ సే ఇట్ నౌ' అనే పుస్తకాన్ని రాకేశ్ మారియా తీసుకొచ్చారు. ముంబై మాఫియాను తాను పోలీస్ కమీషనర్ గా ఉన్న కాలంలో ఎలా కట్టడి చేశారో ఈ పుస్తకంలో పొందుపరిచారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా పనిచేసిన పోలీస్ అధికారిగా రాకేశ్ మారియాకు మంచి పేరుంది. మరి గతంలో కొందరు సినిమా దర్శకులు మహారాష్ట్రకు చెందిన వివిధ పోలీస్ అధికారుల జీవితాలు ఆధారంగా కొన్ని సినిమాలు తీశారు. అందులో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుల చిత్రాలూ ఉన్నాయి. అయితే రోహిత్ శెట్టి... ఈ మాజీ పోలీస్ బాస్ కథను సినిమాగా ఎలా తీస్తారో చూడాలి.