Rashmika Mandanna: బాలీవుడ్ లో కేక పుట్టిస్తోన్న రశ్మిక!

ABN , Publish Date - Feb 17 , 2025 | 05:41 PM

ఎన్ని చెప్పినా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరబ్బా! ప్రస్తుతం వరుస విజయాలతో కన్నడ భామ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) బాలీవుడ్ లో కవాతు చేస్తోంది. రశ్మిక నాయికగా రూపొందిన తాజా హిందీ చిత్రం 'ఛావా' టాక్ ఎలా ఉన్నా భారీ వసూళ్ళు చూస్తోంది.

ఎన్ని చెప్పినా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరబ్బా! ప్రస్తుతం వరుస విజయాలతో కన్నడ భామ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) బాలీవుడ్ లో కవాతు చేస్తోంది. రశ్మిక నాయికగా రూపొందిన తాజా హిందీ చిత్రం 'ఛావా' టాక్ ఎలా ఉన్నా భారీ వసూళ్ళు చూస్తోంది. దాంతో రశ్మిక కిట్ లో మరో హిట్ పడ్డట్టే! ఈ సినిమాకు ముందు రశ్మిక నటించిన 'ఏనిమల్' హిందీ చిత్రం బంపర్ హిట్ గా నిలచింది. ఇక 'పుష్ప-2' హిందీలో డబ్ అయి అక్కడా జయకేతనం ఎగురవేసింది. అలా వరుసగా మూడు బంపర్ హిట్స్ కొట్టేసిన రశ్మిక హిందీలో 'హ్యాట్రిక్' సొంతం చేసుకుందన్న మాట! ఇలా సౌత్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూనే ఉత్తరాదిన కూడా విజయకేతనం ఎగరేసిన కన్నడ భామల్లో బి.సరోజాదేవి  తరువాత రశ్మికనే ఆ స్థాయి సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.


Rashmika-3.jpgకన్నడసీమలో పుట్టిన భామలు, ఆ ప్రాంతానికి చెందిన ముద్దుగుమ్మలు సైతం బాలీవుడ్ ను భమ్ చిక భమ్ ఆడించిన వారున్నారు. అలాంటి వారిలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ (Aishwarya Roy Bachchan)ను ముందుగా చెప్పుకోవాలి. ఈ మంగళూరు బ్యూటీ తమిళ చిత్రం 'ఇరువర్'తో పరిచయమైనా, బాలీవుడ్ బాట పట్టాకే బంపర్ హిట్స్ సొంతం చేసుకుంటూ సాగారామె. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ మురిపించిన పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి (Shilpa Shetty)సైతం మంగళూరు ముద్దుగుమ్మనే. ఆమె కూడా ఉత్తరాదిన సక్సెస్ రూటులో సాగిపోయారు. జెనీలియా డిసౌజా (Genelia) ముంబైలోనే కన్ను తెరచినా ఆమె కన్నవారు కన్నడనేలకు చెందినవారే! అలా ఆమె కూడా మంగళూర్ బ్యూటీ అని చెప్పొచ్చు. దీపికా పదుకొణే (Deepika Padukone) 'ఓం శాంతి ఓం' హిందీ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అయ్యాక అక్కడే తన లక్ టెస్ట్ చేసుకుంటూ ఆమె కూడా వరుస విజయాలు చూశారు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ ఫైవ్ హీరోయిన్స్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించారు దీపిక.


Rashmik-a.jpg

సౌత్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగి, తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత (J.Jayalalitha) కూడా కన్నడనాటనే జన్మించారు. ఆమె మాతృభాష తెలుగు కావడం విశేషం! ఈమె కూడా ధర్మేంద్ర సరసన 'ఇజ్జత్' అనే సినిమాలో నటించి మురిపించారు.
వీరందరి కన్నా మిన్నగా దక్షిణాది భాషల్లో నటిస్తూనే ఉత్తరాదిన సైతం తనదైన బాణీ పలికించిన కన్నడ నాయికగా బి.సరోజాదేవినే చెప్పుకోవాలి. "పైగామ్, ససురాల్, ఓపెరా హౌస్, హాంగ్ కాంగ్, ప్యార్ కియా తో డర్నా క్యా, బేటీ బేటే, దూజ్ కా చాంద్, ప్రీత్ న జానే రీత్, దిల్వార్, హరి దర్శన్" వంటి సినిమాల్లో బి.సరోజాదేవి నటించారు. అప్పటి టాప్ స్టార్స్ అయిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, షమ్మీకపూర్, అజిత్ వంటి వారితో కలసి నటించారామె.

సరోజాదేవి తరువాత అలా సాగుతున్న కన్నడ సుందరిగా ఇప్పుడు రశ్మిక నిలిచారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న 'సికందర్'లోనూ 'థామ' అనే మరో హిందీ చిత్రంలోనూ రశ్మిక నటిస్తున్నారు. ఇవి కాకుండా శేఖర్ కమ్ముల 'కుబేర', రాహుల్ రవీంద్రన్ 'ద గర్ల్ ఫ్రెండ్' కూడా హిందీలో అనువాదమవ్వనున్నాయి. మరి ఈ చిత్రాలతో రశ్మిక ఏ లాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

Updated Date - Feb 17 , 2025 | 05:46 PM