Radhika Apte: మెగా ఫోన్ పడుతున్న వివాదాస్పద నటి
ABN , Publish Date - Mar 08 , 2025 | 06:25 PM
తెలుగుతో పాటు పరభాషల్లోనూ పలు చిత్రాలలో నటించింది రాధికా ఆప్టే. త్వరలో ఆమె హిందీ, మరాఠీ భాషల్లో ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతోంది.
తెలుగులో సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళలను చాలా మందే ఉన్నారు. అయితే ఇటు కథానాయికగా నటిస్తూ అటు సినిమాలను డైరెక్ట్ చేసిన వారు చాలా అరుదు. ఆ కోవలోకి భానుమతి (Bhanumathi), సావిత్రి (Savitri), విజయనిర్మల (Vijaya Niramala) వంటి వారు వస్తారు. తాను నటించకపోయినా... డైరెక్షన్ చేసిన కథానాయికలో జీవిత (Jeevitha) ఒకరు. ఇప్పుడు పలు తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించిన వివాదాస్పద నటి రాధికా ఆప్టే (Radhika Apte) సైతం మెగాఫోన్ చేతిలోకి తీసుకోబోతోంది.
తెలుగులో బాలకృష్ణ (Balakrishna) సరసన 'లెజెండ్, లయన్' వంటి సినిమాలలో నటించింది రాధికా ఆప్టే. అంతేకాదు... పెద్ద చిన్న అనే తేడా లేకుండా మరికొన్ని సినిమాల్లో చేసింది. చిత్రం ఏమంటే... ఆమె నటించిన కొన్ని చిత్రాలలో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఔరా అనిపించుకుంది. అలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొంతకాలం పాటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తో కలిసి రాధికా ఆప్టే పీరియాడికల్ థ్రిల్లర్ 'అక్క'లో చేసింది. ఇది త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే... తాజాగా రాధికా ఆప్టే హిందీ, మరాఠీ భాషలో ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతోంది. 'కోట్యా' అనే పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా యాక్షన్ ఫాంటసీ అట. బలవంతంగా చేసిన మెడికల్ ఎక్స్ పర్మెంట్స్ వల్ల చెరకు కోత కార్మికురాలికి అనుకోకుండా సూపర్ పవర్స్ వస్తాయి. వాటి ద్వారా ఆమె తన కుటుంబాన్ని అప్పుల బారి నుండి ఎలా కాపాడిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అతి త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తామని చిత్ర నిర్మాత విక్రమాదిత్య మోత్వానే చెబుతున్నారు. మరి నటిగా భిన్నమైన పాత్రలు చేసి మెప్పించిన రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: Pawan Kalyan: ఆ చిత్రాల జాబితాలో తీన్ మార్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి