R Madhavan: ఆ రెండు క్షణాలకే భయపడతాను..

ABN , Publish Date - Jan 21 , 2025 | 04:48 PM

‘మరికొన్ని గంటల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకురానుందంటే భయాందోళనకు గురవుతాను. నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో రెండే క్షణాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయి. సినిమా షూట్‌లో మొదటి రోజు భయం వేస్తుంది.

మాధవన్‌ (Madhavan) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘హిసాబ్‌ బరాబర్‌’ (Hisaab Barabar) (జీ5 వేదికగా విడుదల సిద్థమైంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి మాట్లాడారు. తను నటించిన సినిమా రిలీజ్‌ అవుతుందంటే ఇప్పటికీ ఎంతో భయపడతానని అన్నారు.

‘‘మరికొన్ని గంటల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకురానుందంటే భయాందోళనకు గురవుతాను. నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో రెండే క్షణాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయి. సినిమా షూట్‌లో మొదటి రోజు భయం వేస్తుంది. అలాగే సినిమా విడుదల మొదటి రోజు అలాంటి ఆందోళనే ఉంటుంది. రిలీజ్‌ రోజు ప్రజల అభిప్రాయాలు బయటకు వస్త్తాయి. ఆశించిన స్థాయిలో లేకపోతే ‘నీ గేమ్‌ ఓవర్‌’ అని అంటారేమోనని భయపడతాను. ఇలాంటి పరిశ్రమలో 25 ఏళ్లుగా కొనసాగతం సులభం కాదు. కొందరు హీరోలు 25 నెలల్లోనే అవకాశాలు కోల్పోతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. నన్ను ఎంతో మంది ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఆ అభిమానమే నన్ను ఇంకా పరిశ్రమలో కొనసాగేలా చేశాయి. అది లేకపోతే నేను ఎప్పుడో కనుమరుగయ్యేవాడిని’’ అని చెప్పారు.
 
ఇదే వేదికపై ఓటీటీల (OTT Movies) గురించి మాట్లాడారు.‘‘ఒక్కోసారి కథ ఆధారంగా నిడివి ఎక్కువ ఉన్న కంటెంట్‌ చేయాల్సి వస్తుంది. వాటిని థియేటర్‌లో విడుదల చేయలేం. ఇప్పటివరకు ఓటీటీలో వచ్చిన నా ప్రాజెక్ట్‌లన్నీ మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. కొని సిరీస్‌లు అయితే ఎనిమిది ఎపిసోడ్‌లు కూడా ఉన్నాయి. అలాంటి కథను తగ్గించి థియేటర్‌లో విడుదల చేయలేం కదా.. ఇప్పుడు ‘హిసాబ్‌ బరాబర్‌’ (Hisaab Barabar) కూడా అలాంటి కథే. అందుకే ఓటీటీలో విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. మాధవన్‌ హీరోగా అశ్వినీధీర్‌ తెరకెక్కించిన చిత్రం ‘హిసాబ్‌ బరాబర్‌’. ఇందులో ఆయన నిజాయితీ గల టికెట్‌ కలెక్టర్‌ పాత్రలో నటించారు. ఈ నెల 24 నుంచి జీ5 వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది.

Updated Date - Jan 21 , 2025 | 04:48 PM