Mrunal Thakur: ‘ఎమర్జెన్సీ’ మృణాల్‌ ఠాకూర్‌ రివ్యూ

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:31 PM

కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (emergency). ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను వీక్షించినట్లు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) పోస్ట్‌ పెట్టారు.


కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (emergency). ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను వీక్షించినట్లు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) పోస్ట్‌ పెట్టారు. కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మా నాన్నతో కలిసి ‘ఎమర్జెన్సీ’ చూశాను. ఆ సినిమా అందించిన అనుభూతి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. కంగనా ఫ్యాన్‌గా ఈ సినిమాను బిగ్‌స్ర్కీన్‌పై చూడడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆమెకు అద్భుతమైన విజయం. ‘గ్యాంగ్‌స్టర్‌’ నుంచి ‘క్వీన్‌’ వరకు.. ‘తను వెడ్స్‌ మను’ నుంచి ‘మణికర్ణిక’, ‘తలైవి’ వరకు.. ఇప్పుడు తాజాగా ‘ఎమర్జెన్సీ’ ఇలా నిరంతరం ఆమె నటనలో సరిహద్దులు దాటుతూ అద్భుతమైన ప్రతిభతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి అంశం నన్ను ప్రభావితం చేసింది. కెమెరా యాంగిల్స్‌, కాస్ట్యూమ్స్‌.. ప్రతిదీ నన్ను ఆకర్షించాయి. ఈ చిత్రంతో కంగనా దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారు. స్ర్కీన్‌ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్‌ అన్నీ బాగున్నాయి’’ అని అన్నారు.



‘‘కంగనాతోపాటు నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. నిజమైన కళాకారిణి. సవాలుతో కూడిన పాత్రలు పోషించడంలో ఆమె చూపించే ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సినిమాపై మీకున్న అంకితభావం ప్రతి ఫేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాను చూడనివారు కచ్చితంగా చూడండి. భారతీయులు అంతా తప్పక చూడాల్సిన చిత్రమిది. సినిమా చూశాక భావోద్వేగంతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారని నేను హామీ ఇస్తున్నా’’ అని మృణాల్‌ పేర్కొన్నారు. కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’.  ఇందిరా గాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు.

Updated Date - Feb 12 , 2025 | 05:31 PM