Pratik Gandhi: జ్యోతిరావు ఫూలే జయంతికి బయోపిక్

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:50 PM

కుల వివక్ష పైనే కాదు మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. ఆయన భార్య సావిత్రిబాయి సైతం భర్త అడుగుజాడల్లో నడిచారు. వీరి జీవిత గాథ ఏప్రిల్ 11న జనం ముందుకు రాబోతోంది.

సమాజంలోని అసమానతలపై పోరాటం చేసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే (Jyotirao Phule). బ్రిటీషర్స్ నుండి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందడంతో పాటు, భారతదేశంలోని అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాష్ఠికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. తన జీవితాన్ని, భార్య సావిత్రిబాయి (Savitribai) సహకారంతో పోరాటం, ప్రతిఘటన, సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడాయన.


కోట్లాది మంది జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేసిన జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను అనంత్ మహదేవన్ (Ananth Mahadevan) వెండితెరపై ఆవిష్కరించారు. మార్చి 24న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11 జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇందులో జ్యోతీరావు ఫూలేగా ప్రతీక్ గాంధీ (Pratik Gandhi) నటించగా, ఆయన భార్య సావిత్రిబాయిగా పత్రలేఖ (Patralekhaa) నటించారు. మహారాష్ట్రలో అగ్ర వర్ణాల వారి దాడులను తట్టుకుని, మొక్కవోని విశ్వాసంతో కుల వివక్ష, బాలికల విద్యాబోధన, వితంతు మహిళల హక్కులకై పోరాడిన ఈ దంపతుల జీవిత గాథను స్ఫూర్తి దాయకంగా అనంత్ మహదేవన్ తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది.

Also Read: NBK Vs Raviteja: మరోసారి బరిలో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 05:51 PM