Chhaava Tax-free: ధీరుడి కథ అందరికీ చేరువ కావాలనే ఉద్దేశం..
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:11 PM
చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని భావోద్వేగానికి గురి చేసిన చిత్రం 'ఛావా’ (Chhaava Movie). ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లబిస్తుంది. సినిమా అందరికి చేరువ కావాలని పలు ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని భావోద్వేగానికి గురి చేసిన చిత్రం 'ఛావా’ (Chhaava Movie). శంభాజీ మహారాజ్ ( Chhatrapati Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman Utekar) తెరకెక్కించిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లబిస్తుంది. ఆ పోరాట యోధుడి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్ తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా అందరికీ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపునిచ్చాయి.
‘ఛావా’కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పన్ను మినహాయింపును ప్రకటించింది. బుధవారం ఛత్రపతి శివాజీ(Shivaji Maharaj) జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కాలని ఆయన అన్నారు. అలాగే గోవాలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మహారాష్ట్రలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు (Chhaava tax-free) కలిగించాలని వస్తున్న విజ్ఞప్తుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు. ‘‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంపై గొప్ప సినిమా తీసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ సినిమాను చూడలేదు. చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తాం’’ అని అన్నారు.
ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) దేవేంద్ర ఫడణవీస్‌కి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. ‘‘ఈ ధీరుడి కథ, ఆయన వారసత్వం, ధైర్యం రానున్న తరాలకు తెలియాలి. ఈ చిత్రం ఎక్కువమంది ప్రేక్షకులకు చేరుకోవాలి. ఈ ప్రభుత్వం ‘ధర్మో రక్షతి రక్షితః’ను బలంగా విశ్వసిస్తుందని మేం అనుకుంటున్నాం. ఈ చిత్రం ఇదే భావాన్ని చూపుతోంది. దీనికి ఆదరణ పెరగాలి ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని లేఖలో పేర్కొంది.