IFFA: కోరిన మార్పు వచ్చింది.. ఇంకా రావాలి
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:31 PM
జైపూర్‌లో జరిగిన ఐఫా ఉత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ మాట్లాడారు.
జైపూర్‌లో జరిగిన ఐఫా (IFFA) ఉత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ (Madhuri dixit) మాట్లాడారు. ‘‘చిత్రసీమలోని మహిళలు ప్రతిసారీ తమని తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. హీరోల్లాగే మేమూ ప్రేక్షకులను ఆకర్షించగలం. అందరం సమానమే. పారితోషికం విషయంలో కూడా వ్యత్యాసం అలాగే కొనసాగుతుంది. నా కెరీర్‌లో ఎన్నో గొప్ప బలమైన పాత్రలు చేయగలిగాను. ‘బేటా’, ‘దిల్’, ‘రాజా’, ‘దిల్ తో పాగల్ హై’.. ఇలా చాలా ఉన్నాయి. నిజంగా నేను ఎంతో ఆస్వాదిస్తూ చేసిన ఒకే ఒక్క చిత్రం ‘మృత్యుదండ్’. మాధురీ కమర్షియల్ చిత్రాలే బాగా చేయగలదు అనుకొనేవారు. అలాంటి సమయంలో నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. మహిళా సాధికారతను గొప్పగా చూపించిన పాత్రను ఇందులో నేను పోషించాను. ఓ మహిళ తలెత్తుకొని నిలిచి తనేంటో చెప్పిన చిత్రం. ఒకప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ లాంటి ఒకటో రెండో విభాగాాల్లో మాత్రమే స్ర్తీలు కనిపించేవారు. నెమ్మదిగా అది మారుతూ వచ్చింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఉన్నారు. నిజంగా ఇది చాలా పెద్ద మార్పు’’ అని అన్నారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత గునీత్ మోంగా(guneet monga) మాట్లాడుతూ ‘‘పారితోషికం విషయంలో హీరోహీరోయిన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో నటులు స్పందించాల్సిన అవసరం ఉంది. నాయికా ప్రాధాన్య చిత్రం ‘స్త్రీ 2’ భారీగా వసూళ్లు తీసుకొచ్చింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయగల సత్తా మహిళల్లో ఉంది. దాని కోసం అవకాశాలు మనమే సృష్టించుకోవాలి. గణాంకాలు చూస్తుంటే కాస్త బాధగానే ఉంది. దర్శకుల్లో మహిళలు మూడు శాతం కంటే తక్కువే ఉన్నారు. నటుల్లో 9 శాతం కంటే తక్కువే ఉన్నారు. కానీ ఈ పరిస్థితి మారాలి’’ అన్నారు.
ఇదే అందరూ కోరుకునేది: మధుబాల
‘‘ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు నాయికలకు ఉండేది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు మారాయి. నేటితరం పక్కా ప్రణాళికతో సినిమాల్లోకి వస్తున్నారు. అందరూ సమానమే అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. ఇదే అందరూ కోరుకునేది’’.
ఎంతమారితే అంత మంచిది: షబానా అజ్మీ
‘‘సినిమాల్లో మహిళలుఅంటే గ్లామర్‌డాల్స్ అనే పరిస్థితే ఉండేది. కానీ ఇప్పుడు అన్ని శాఖల్లోనూ వాళ్లు సత్తా చాటగలరు. ఒకప్పటితో పోల్చుకుంటే ఆ పరిస్థితిలో కొంత మార్పువచ్చింది. అన్ని విభాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. అసమానతలు ఎంత తగ్గితే చిత్రసీమకు అంత మంచిది.’’
‘‘అగ్ర నటులకు దీటుగా నాయికలు నటిస్తున్నారు. అలాంటి కథలతో దర్శకరచయితలు ముందుకొస్తున్నారు. నటీమణులు ఒక్క భాషకే పరిమితం కావడం లేదు. మంచి పాత అయితే ఎక్కడైనా చేయడానికి సిద్థంగానే ఉంటున్నారు. తామేంటో నిరూపించుకోవడానికి కంఫర్ట్ జోన్ దాటి మరీ ముందుకెళుతున్నారు’’ అని జ్యోతిక అన్నారు.