Madhu Chopra: ఆకతాయిలు వెంటపడేవారు.. గోడ దూకాడు
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:21 PM
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కష్టాలు అన్నీఇన్నీ కాదు. సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకోవడానికి ఒకరకమైన కష్టాలు అనుభవిస్తే.. చిన్నతనంలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందట. ఈ విషయాన్ని ఆమె తల్లి మధు చోప్రా (madhu Chopra) చెప్పారు.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కష్టాలు అన్నీఇన్నీ కాదు. సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకోవడానికి ఒకరకమైన కష్టాలు అనుభవిస్తే.. చిన్నతనంలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందట. ఈ విషయాన్ని ఆమె తల్లి మధు చోప్రా (madhu Chopra) చెప్పారు. ఆ జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. స్కూల్ రోజుల్లోనే ప్రియాంకను చూసేందుకు ఎంతోమంది యువకులు అత్యుత్సాహం చూపేవారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. Priyanka Chopra Childhood memories)
‘‘ప్రియాంక చిన్నతనంలో కొంతకాలం యూఎస్‌లో ఉంది. అక్కడి నుండి వచ్చాక తను మాతోపాటు బరేలీలో ఉండి చదువుకుంది. యూఎస్‌లో ఉండటం వల్ల తనకు పాశ్చాత్య సంస్కృతి అలవాటు అయింది. ముఖ్యంగా వెస్ట్రన్ దుస్తులు ఎక్కువగా ధరించేది. ఆమెను చూసేందుకు యువకులు అత్యుత్సాహం కనబరిచేవారు. దాంతో తనను స్కూల్‌కు ప్రతిరోజూ కారులో తీసుకువెళ్లి తీసుకువచ్చేవాళ్లం. ఆకతాయిలు కారు వెంటపడేవారు. ఓరోజు ఒక యువకుడు మా ఇంటి గోడ దూకాడు. ఆ ఘటనతో మేమెంతో భయపడ్డాం. దాంతో నా భర్త ఇంటి చుట్టూ ఇనుప రాడ్డులతో ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. దానితర్వాత కొంతకాలం పాటు ప్రియాంక వెస్ట్రన్ దుస్తులు వేసుకోలేదు. అప్పటివరకూ ఉన్న దుస్తులన్నీ పక్కన పెట్టేసి.. సల్వార్ కమీజ్‌లు ధరించడం అలవాటు చేసుకుంది’’ అని మధు చోప్రా చెప్పారు.
ప్రియాంక నటించిన ‘దోస్తానా’ గురించి మాట్లాడుతూ.. ‘‘జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ప్రియాంక కలిసి వర్క్ చేసిన సినిమా అది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రియాంక జ్వరంతో ఇబ్బంది పడింది. టాబ్లెట్స్ వేసుకున్నా జ్వరం తగ్గలేదు. దాంతో షూట్‌కు వెళ్లొద్దని చెప్పాను. దర్శకుడు తరుణ్ మన్సుఖానితో విషయం చెప్పేందుకు తను ఎంతో భయపడింది. నేను ఫోన్ చేసి విషయం చెప్పినప్పటికీ ఆయన మాత్రం ప్రియాంక రావాల్సిందేనన్నారు. నాకెంతో కోపం వచ్చింది. ‘నా కుమార్తెను సెట్‌కు పంపుతా. తనకు ఏమైనా జరిగితే నీదే బాధ్యత’ అని హెచ్చరించా’’ అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.