Kirti Kulhari: 'పింక్’ విషయంలోనే అలా జరిగిందంటూ నటి భావోద్వేగం
ABN , Publish Date - Feb 20 , 2025 | 03:51 PM
‘పింక్’ (Pink) చిత్రంలో ఫాలక్ అలీ (Falak Ali) పాత్రలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కీర్తి కుల్హారి. (Kirti Kulhari) ఆ సినిమా సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘పింక్’ (Pink) చిత్రంలో ఫాలక్ అలీ (Falak Ali) పాత్రలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కీర్తి కుల్హారి. (Kirti Kulhari) ఆ సినిమా సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. షూటింగ్, ప్రమోషన్స్‌లో ఎవరూ తనకు సరైన విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ (AMitab Bachchan) తర్వాత ఆ సినిమాలో విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్న వ్యక్తి తాప్సీ (Taapsee Pannu) మాత్రమేనని అన్నారు.
‘‘ ఇండస్ట్రీలో చిన్నా, పెద్దా తేడాలు ఉండవని నటీనటులందరినీ ఒకేలా చూస్తారనే అభిప్రాయం నాది. గతంలో నేను వర్క్ చేసిన సినిమాల్లో అలాంటి బేధాభిప్రాయాలు ఎక్కడా చూడలేదు. ఆ సినిమా సెట్స్‌లో అందరూ కలసికట్టుగా ఉండేవాళ్లం. ‘పింక్’ చిత్రం చిత్రీకరణ సమయంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇండస్ట్రీలో పరిస్థితలు ఎలా ఉంటాయో అప్పుడే అర్థం చేసుకున్నా. సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు చూసి ఎంతో బాధపడ్డా. ఎందుకంటే, అందులో మొత్తం సీన్స్ అమితాబ్, తాప్సీవే ఉన్నాయి. సినిమా కోసం నేను ఎంతలా వర్క్ చేశానో తెలుసని నాకు నేను సర్దిచెప్పుకున్నా.
ఈ సినిమా రచయిత సూజిత్ నా బాధను అర్థం చేసుకున్నారు. ‘‘బాధపడకు.. సినిమా పూర్తి కానివ్వు. నీకు రావాల్సిన గుర్తింపు వస్తుందిలే’’ అని ధైర్యం చెప్పారు. ప్రమోషన్స్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నా. అందరూ తాప్సీ పైనే ఫోకస్ పెట్టేవాళ్లు. ఇదంతా పీఆర్ స్ర్టాటజీ అని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే పీఆర్‌కు నేను దూరం. నా వర్క్‌పై నాకు పూర్తి నమ్మకం. ప్రేక్షకులని తప్పకుండా నన్ను ఆదరిస్తారని నమ్మా. ఆ సినిమా తర్వాత పీఆర్ గేమ్‌పై ఫోకస్ పెట్టా’’ అని కీర్తి అన్నారు.
అనిరుద్థారాయ్ తెరకెక్కించిన చిత్రం ‘పింక్’. ఢిల్లీలో ముగ్గురమ్మాయిలకు ఎదురైన చేదు సంఘటన నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సినిమా 2016లో విడుదలైంది. మంచి వసూళ్లతోపాటు పలు పురస్కారాలు దక్కించుకుంది. ‘బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూస్’ కేటగిరీలో జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. తమిళ్‌లో అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వై’ తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా ‘వకీల్‌సాబ్’ టైటిళ్లతో రీమేక్ అయి దక్షిణాది ప్రేక్షకులనూ అలరించిందీ సినిమా.