Kiara Advani: కియారా ఆడ్వాణీ కిర్రాక్!

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:30 PM

యశ్ మూవీ 'టాక్సిక్'లో నటిస్తున్నందుకు కియారా ఆడ్వాణీకి అక్షరాలా పదిహేను కోట్ల రూపాయలు పారితోషికం అందజేస్తున్నారట! అమ్మడి గిరాకీ మామూలుగా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు!!

తెలుగు చిత్రాలు 'భరత్ అనే నేను, వినయ విధేయ రామా, గేమ్ చేంజర్' చూసిన వారెవరికైనా అందులో నాయికగా మురిపించిన కియారా ఆడ్వాణీ (Kiara Advani) అందం గుర్తుకు రాకమానదు. నార్త్ లో అయితే అమ్మడిని అందం చూసి అందరూ 'జూనియర్ హేమమాలిని' అంటున్నారు. అంటే నవతరం 'డ్రీమ్ గర్ల్' (Dream Girl) అన్నమాట. ఆమె నటించిన సౌత్ మూవీస్ అన్నీ తెలుగులోనే రూపొందాయి. తొలిసారి కన్నడలో హీరో యశ్ (Yash) తో కలసి నటిస్తోంది కియారా. ఆ చిత్రాన్ని మళయాళ నటి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. సినిమా పేరు 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్' (Toxic: A Fairy Tale for Grown Ups). ఈ సినిమాను ఇంగ్లిష్ లోనూ రూపొందిస్తూ ఉండడం విశేషం! ఇందులో నయనతార, హ్యూమా ఖురేషీ కూడా నటిస్తున్నారు. వారి ముచ్చటేమో కానీ, 'టాక్సిక్'లో నటిస్తున్నందుకు కియారా ఆడ్వాణీకి అక్షరాలా పదిహేను కోట్ల రూపాయలు పారితోషికం అందజేస్తున్నారట! అమ్మడికి సౌత్ లో అదరహో అనే హిట్స్ లేకపోయినా అంత రేటు పలికిందంటే మిగిలిన బాలీవుడ్ భామలు ఎంతలా డిమాండ్ చేస్తున్నారో అన్న అనుమానం కలుగక మానదు.


బాలీవుడ్ లో భమ్ చిక భమ్ ఆడిస్తేనున్న దీపికా పదుకొణే తెలుగు చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 A.D) లో నటించడానికి అక్షరాలా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అందుకుందని సమాచారం. ఇక మహేశ్ బాబు , రాజమౌళి సినిమాలో నటిస్తోన్న ఇంటర్నేషనల్ హీరోయిన్ గా పేరొందిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) 30 కోట్ల రూపాయలు పుచ్చుకుంటోందనీ టాక్! దీపిక, ప్రియాంక ఇద్దరూ చిత్రసీమలో తమదైన బాణీ పలికించినవారే. కాబట్టి వారు అంత డిమాండ్ చేయడంలో తప్పులేదంటున్నారు బాలీవుడ్ బాబులు. కానీ, సౌత్ లో ఒకే ఒక్క హిట్ తోనే కియారా 15 కోట్ల రూపాయలు పట్టుకోపోతోందన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్!


'కేజీఎఫ్' సిరీస్ తో కన్నడ స్టార్ యశ్ ఆల్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ క్రేజ్ తోనే యశ్ పై భారీ పెట్టుబడి పెడుతున్నారు. యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ రూపొందించబోయే చిత్రం 'టాక్సిక్' 200 కోట్ల రూపాయలతో తెరకెక్కనుందని తెలుస్తోంది. నయనతార, హ్యూమా ఖురేషి వంటి తారలు కూడా ఉండడం వల్ల 'టాక్సిక్' పాన్ ఇండియా మూవీగా అలరించనుంది. అంతేకాదు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసి యశ్ కు ఇంటర్నేషనల్ ఐడెంటిటీ కూడా తీసుకు రావాలన్నదే ప్రయత్నం. అందువల్లే ఈ చిత్రానికి యశ్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మరి యశ్ అంచనాలను నయనతార, హ్యూమా ఖురేషి, కియారా ఆడ్వాణీ ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.

Also Read: Mahesh Babu: తగ్గేదే లే అంటున్నాడుగా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 22 , 2025 | 04:30 PM