Kareena Kapoor Khan: సైఫ్‌పై దాడి.. ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం..

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:03 PM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటనపై ఆయన సతీమణి కరీనా కపూర్‌ ఖాన్‌ స్పందించారు. ఆమె ఏమన్నారంటే


బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Ali Khan) ముంబయిలోని తన నివాసంలో ఓ దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే! కత్తిపోట్లకు గురైన సైఫ్‌ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వెన్నుకు, ఎడమచేతికి సర్జరీ చేశారు. ఈ ఘటనపై ఆయన సతీమణి కరీనా కపూర్‌ ఖాన్‌ (Kareena Kapoor khan) స్పందించారు. ‘‘మా కుటుంబానికి ఇది ఎంతో కఠినమైన సమయం. సవాల్‌తో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు.. మీడియా వర్గాలు సంయమనం పాటించాలి. ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ.. ఇటువంటి చర్యలు మా భద్రతకు మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Kareena.jpg
 
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్‌పై ఘటన చోటుచేసుకుంది. సైఫ్‌, అతడి కుటుంబం నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. మరోవైపు.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Updated Date - Jan 17 , 2025 | 12:03 PM