Kangana Ranaut: కంగనా 'ది మౌంటెన్ స్టోరీ’ హిమాలయాల నడిబొడ్డున..
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:29 AM
'పెద్దల మాట చద్ది మూట’ అనే విషయం ఇప్పుడు తనకు అర్థం అయిందని బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అంతే కాదు
'పెద్దల మాట చద్ది మూట’ అనే విషయం ఇప్పుడు తనకు అర్థం అయిందని బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అంతే కాదు తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. హిమాచల్‌లోని మనాలిలో (Manali) కేఫ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘నా చిన్ననాటి కల ‘ది మౌంటెన్ స్టోరీ’ (The Mountain Story) హిమాలయాల నడిబొడ్డున వికసించింది. ఈ కేఫ్ కేవలం భోజనం చేసే ఒక ప్రదేశం కాదు.. నా తల్లి వంట గది సువాసనలకు నిలయం’’ అని రాశారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నతనాన్ని, తన మాతృమూర్తి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘ఒక మహిళగా ఇంటి పనులకు ఎక్కువ సమయం కేటాయించాలని అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. ఊరగాయ, నెయ్యి తయారు చేయడం, కూరగాయలు ఎలా పండించాలో నేర్చుకోమని చెప్పేది. ఆ మాటల్ని పట్టించుకునే దాన్ని కాదు. అమ్మ తెలివితక్కువతనం తో చెబుతుంది అనుకునేదాన్ని. అవి నేర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదనుకున్నాను. దేశంలోనే చిన్న వయసులో ధనవంతురాలైన మహిళల్లో నేను ఒకదాన్ని అని అనుకునేదాన్ని. కానీ, ఆమె మాటలకు అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైంది. నేను కేఫ్ ప్రారంభించాను. మా అమ్మ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నేను పరిణతి చెందానని, తెలివైనదాన్ని అయ్యానని అమ్మ భావిస్తోంది. పెద్దల మాట చద్ది మూట.. వారు చెప్పింది వినాలి, పాటించాలి అని ఇప్పుడు అర్థమైంది’’ అని కంగనా అన్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా కంగనా ఈ బిజినెస్‌కు శ్రీకారం చుట్టారు.