Sunny Deol: జాట్ -2 పై నీలినీడలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 02:00 PM

సన్ని డియోల్ తాజా చిత్రం 'జాట్' వంద కోట్ల దిశగా సాగుతోంది. అయితే ఈ సినిమాకు దక్కిన విజయం పట్ల చిత్ర బృందంలోని కొందరు సంతృప్తి కరంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'జాట్ -2' ఉండకపోవచ్చునని అంటున్నారు.

బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) హీరో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన 'జాట్' (Jaat) సినిమా ఏప్రిల్ 17న విడుదలైంది. మలినేని గోపీచంద్ (Malineni Gopichand) తెరకెక్కించిన ఈ సినిమాకు చక్కని ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో సన్నీ డియోల్ ఖాతాలో మరో హిట్ పడిందని అందరూ చెప్పుకున్నారు. ఇప్పటికే రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ సినిమా వసూలు చేసింది. అతి త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే... 'జాట్'కు లభించిన విజయం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 'గదర్ -2' (Gadar -2) చిత్రం ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేయగా, 'జాట్' వంద కోట్లను క్రాస్ చేయడం ఏమంత చెప్పుకోదగ్గ విజయం కాదని వారు వాదిస్తున్నారు. చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ సైతం 'జాట్' కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాలేదని వాపోయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన దానిని ఖండించారు. 'జాట్'కు లభించిన విజయం పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. 'జాట్'కు సీక్వెల్ ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు, చిత్ర కథానాయకుడు సన్నీ డియోల్ కూడా ప్రకటించారు. వచ్చే యేడాది ఈ సీక్వెల్ పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. అయితే... 'జాట్' కలెక్షన్స్ ను మరింత పెంచుకోవడం కోసం, మూవీపై హైప్ క్రియేట్ కావడం కోసం చిత్ర నిర్మాణ సంస్థ చేసిన ప్రకటన తప్పితే... 'జాట్' సీక్వెల్ ఉండదని అంటున్నారు.


మైత్రీ మూవీ మేకర్స్ 'జాట్' సినిమా విడుదల రోజునే తమిళంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) మూవీని కూడా రిలీజ్ చేసింది. అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. తెలుగులో మూవీ వాష్ అవుట్ అయ్యింది. తమిళంలోనూ మూవీకి స్పందన కరువైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే... ఈ సినిమా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసులూ చేసినట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇటు 'జాట్', అటు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలో ఎందుకు ఈ సంస్థ వాస్తవాలను దాచిపెడుతోందనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా మలినేని గోపీచంద్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమాను ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ సమయంలో ఈ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయని అంగీకరిస్తే... తమ సంస్థ గుడ్ విల్ దెబ్బతినే ఆస్కారం ఉందని సదరు నిర్మాతలు భావించి ఉంటారని అనుకుంటున్నారు.


'జాట్' నిర్మాతల క్షమాపణలు

ఏప్రిల్ 17న 'జాట్' మూవీ విడుదలైన తర్వాత ఇటు దక్షిణాదిలోనూ, అటు ఉత్తరాదిలోనూ ఈ సినిమాపై కొన్ని విమర్శలు చెలరేగాయి. తమిళనాడులోని కొన్ని సంస్థలు ఈ సినిమాలో ఎల్.టి.టి.ఇ. ని బ్యాడ్ గా చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశాయి. శ్రీలంకలో తమిళులకు అండగా ఉన్న ఎల్.టి.టి.ఇ. ని తప్పుగా చూపడం కరెక్ట్ కాదని వాదించాయి. ఇదే విధంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని పంజాబ్ లోని క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాదు... చిత్ర కథానాయకుడు సన్నీ డియోల్, ప్రతినాయకుడు రణదీప్ హుడాతో పాటు మరో ముగ్గురిపై కేసు పెట్టాయి. దీంతో చిత్ర బృందం క్షమాపణలను తెలిపింది. ఎవరి మత విశ్వాసాలను కించపర్చాలన్నది తమ ఉద్దేశ్యం కాదని పేర్కొంది. ఏ సన్నివేశాల పట్ల వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారో వాటిని సినిమా నుండి తొలగించామని నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో 'జాట్ -2' మూవీ సీక్వెల్ ఉండకపోవచ్చునని అనుకుంటున్నారు.

Also Read: Kollywood: కార్తీ చేతిలో ఆరు చిత్రాలు...

Also Read: Chiranjeevi: మెగా డ్యాన్స్ పోటీల సంబరాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 19 , 2025 | 02:00 PM