Kumbh Mela: సన్యాసినిగా మారిన హీరోయిన్.. బహిష్కరించిన అఖాడా
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:30 PM
Kumbh Mela: మమతా కులకర్ణి అలియాస్ ‘మాయీ మమతానంద్ గిరి’ని అఖాడా బహిష్కరించింది. తాజాగా జరుగుతున్న కుంభమేళాలో మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారిన విషయం తెలిసిందే
తాజాగా జరుగుతున్న కుంభమేళాలో మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారిన విషయం తెలిసిందే. ఆమె కిన్నెర అఖాడాలో (Kinnar Akhara) లో మహామండలేశ్వర్‌గా దీక్షా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు మత పెద్దలు, అఖాడాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా ఆమెను కిన్నెర అఖాడా నుండి బహిష్కరించారు. అలాగే ఆమెను అఖాడాలో చేర్పించిన గురువుపై కూడా బహిష్కరణ విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
కుంభమేళా ప్రారంభంలో ఆమెను లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి కిన్నెర అఖాడాలో చేర్చుకుంటూ అఖాడాలో అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను ఇచ్చారు. అలాగే ఆమె పేరును ‘మాయీ మమతానంద్ గిరి’గా మార్చారు. ఈ నేపథ్యంలోనే పలువురు అఖాడాలు ఆరంభంలోనే ఆమెకు అంతా గొప్ప హోదా ఎలా ఇస్తారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా కూడా 'మహా కుంభమేళా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం, కానీ కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి.. మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారంటూ' ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్.. మమతా కులకర్ణితో పాటు గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా కిన్నెర అఖాడా నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు.ఈ నేపథ్యంలోనే లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. అజయ్ దాస్ అఖాడా నుండి బయటకు వెళ్లి, కుటుంబంతో నివసిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదని తెలిపాడు.
మమతా కులకర్ణి ఎవరంటే
మమతా కుల్‌కర్ణి.. మహారాష్ట్రలో ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి ముంబయి మాజీ కమిషనర్. మోడ్రన్ స్కూల్ లో చదువు. చిన్నప్పటి నుండే కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండేది. ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక మోడల్ అయ్యింది. మోడలింగ్ ప్రారంభించిన కొన్ని రోజులకే సినిమాల్లో అవకాశాలు లభించాయి. 1992లో ‘తిరంగ’ అనే సినిమాతో డెబ్యూ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఆమె నటించిన ‘ఆషికి ఆవారా’ సినిమా నిరాశపరిచిన అవార్డులు మాత్రం ఆమెను వరించాయి. ‘లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్’తో పాటు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకుంది. అనంతరం తెలుగులోనూ ‘ప్రేమశిఖరం’, ‘దొంగా పోలీస్’ వంటి చిత్రాలలో నటించిన ఆమె తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది. ‘వక్త్ హమారా హై’, ‘క్రాంతి వీర్’, ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడే ఖిలాడీ’, ‘బాజీ’ వంటి చిత్రాలతో సూపర్ స్టార్‌డం చూసింది. తర్వాత డ్రగ్స్ రాకెట్ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం విదేశాలకు వెళ్ళిపోయింది. తాజా కుంభమేళాతో 21 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో అడుగు పెట్టింది.