Saif Ali Khan knife attack : సైఫ్ హెల్త్ అప్‌డేట్ ఇదే..
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:52 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ నితిన్ డాంగే స్పందించారు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమయానికి ఇంట్లో కార్ లేకపోవడంతో సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ నితిన్ డాంగే స్పందించారు. "సైఫ్ అలీఖాన్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒంటి మీద కత్తి పోట్లతో ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు థొరాసిక్ వెన్నెముకకు పెద్ద గాయం అయింది. వెన్నెముకలో ఉన్న కత్తిని సర్జరీ సాయంతో తొలగించాం. వెన్నెముక నుంచి కారుతున్న ద్రవాన్ని కట్టడి చేశాం. అతని ఎడమ చేతి, మెడపై లోతైన గాయాలకు ఉన్నాయి. వాటికి కూడా సర్జరీ చేశాం. మెడకు జరిగిన బలమైన గాయాన్ని ప్లాస్టిక్ సర్జన్ బృందం మెరుగు పరచింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు’’ అని డాక్టర్ వెల్లడించారు.
లీలావతి హాస్పిటల్ ఏం చెప్పింది?
సైఫ్ అలీఖాన్‌ను బాంద్రా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని, తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారని లీలావతి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నీరాజ్ తెలిపారు.
సైఫ్ అలీఖాన్ ఆరు కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డారని..వాటిలో ఒకటి వెన్నెముకకు ప్రమాదకరంగా ఉందని తెలిపారు.
న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ నేతృత్వంలోని వైద్యుల బృందం సైఫ్ అలీఖాన్‌కు 2.5 గంటల పాటు న్యూరో సర్జరీ చేసింది.
సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు.
నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నారని, వైద్యులు అతని పురోగతిని పర్యవేక్షిస్తున్నారని సైఫ్ అలీ ఖాన్ బృందం ప్రకటన చేసింది.