Vivek Agnihotri : గ్రోక్ తో సారి చెప్పించుకున్న డైరెక్టర్

ABN , Publish Date - Mar 21 , 2025 | 07:57 PM

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్రిహోత్రికి కోపమొచ్చింది. తనపై తప్పుడు ప్రచారం చేసిన గ్రోక్ తో ఆయన సారీ చెప్పించుకున్నారు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచార, సాంకేతిక రంగాన్నీ శక్తివంతం చేయడమే కాదు వివాదాలకు కారణమవుతోంది.‌ ఇటీవల ట్విట్టర్లో పాపులర్ అయిన గ్రోక్ ఎ.ఐ. (Grok AI) తాజాగా చేసిన ఓ పని దుమారం రేపుతోంది. లేటెస్ట్ గా గ్రోక్ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక నెటిజన్ తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారి జాబితా గురించి అడిగినప్పుడు, గ్రోక్ ఆ జాబితాలో ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పేరు చేర్చడంతో సమస్య మొదలైంది. దీంతో ఆ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫలితంగా గ్రోక్ సంస్థ అతనికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ సంఘటనతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి సందర్భాలు భవిష్యత్తులో ఇంకా ఎన్ని సమస్యలకు దారితీస్తాయో అని మండిపడుతున్నారు.

తప్పు వార్తలు సృష్టించే వ్యక్తిగా గ్రోక్ సూచించిన ఆ వ్యక్తి మరెవరో కాదు 'ది కశ్మిర్ ఫైల్స్' (The Kashmir Files) మేకర్, బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)! ఈ విషయం తెలిసిన ఆయన తన పరువును దెబ్బతీసే విధంగా గ్రోక్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉందని, తన కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆవేదన వెలిబుచ్చాడు. చాలా సంవత్సరాలుగా సినిమాల ద్వారా ప్రేక్షకులకు కొత్త విషయాలను అందిస్తున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, దీనికి బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ఆయనకు మద్దతుగా పలువురు నెటిజన్లు గ్రోక్‌ను విమర్శిస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల వ్యవస్థకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.


ఈ వివాదంపై గ్రోక్ స్పందిస్తూ, వివేక్ అగ్నిహోత్రికి క్షమాపణలు చెప్పింది. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆ జాబితా రూపొందించినట్లు, ఇది పొరపాటుగా జరిగిందని గ్రోక్ ప్రతినిధులు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని, వాస్తవాలను ధృవీకరించిన తర్వాతే సమాధానాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, నిపుణులు ఇలాంటి ఏఐ సాధనాలను అతిగా నమ్మవద్దని, ఇవి ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా ఫాలో కాకూడదని సూచిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉందని, అందుకే జాగ్రత్తగా ఇలాంటి వాటిని ఉపయోగించాలని వారు చెబుతున్నారు.

Also Read: Pradhas: బ్లాస్టింగ్ కాంబోకు ముహూర్తం ఫిక్స్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 21 , 2025 | 07:57 PM