Dilwale Dulhania Le Jayenge: షారుఖ్, కాజల్ కాంస్య విగ్రహాలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:14 PM
భారతదేశంలో ఏ నటుడికి, నటికి దక్కని అరుదైన గౌరవం 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' హీరోహీరోయిన్లకు దక్కుతోంది.
ఈ యేడాదితో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) , కాజోల్ (Kajol) - ఆల్ టైమ్ హిట్ - 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' (Dilwale Dulhania Le Jayenge) 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది... ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఆ సినిమా కీర్తి కిరీటంలో మరో రత్నం చేరబోతోంది...
సినిమా రన్నింగ్ లో వరల్డ్ వైడ్ గా రికార్డ్ సృష్టించిన మూవీ 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే'. ఈ చిత్రం 1995 అక్టోబర్ 20న విడుదలై అఖండ విజయం సాధించింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' ప్రదర్శితమవుతూనే ఉండడం విశేషం! ఆరంభంలో రెగ్యులర్ షోస్ తో పరుగులు తీసిన ఈ చిత్రం తరువాత కొన్నేళ్ళుగా రోజుకు ఓ ఆటతో రన్ అవుతూనే ఉండడం గమనార్హం! ఇంతటి రన్ చూసిన చిత్రరాజం ప్రపంచంలోనే ఏదీ లేదని సినీపండిట్స్ అంటూ ఉంటారు. ఈ సినిమా రాబోయే అక్టోబర్ 20తో ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. మూడు దశాబ్దాలుగా ఓ సినిమా ఒకే థియేటర్ లో నడవడమే ఓ గ్రేటెస్ట్ రికార్డ్! కాగా ఈ సినిమా కీర్తి కిరీటంలో మరో రత్నం చేరబోతోందని టాక్.
కథానుగుణంగా 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా కొంత భాగం లండన్ లోనూ చిత్రీకరణ జరుపుకుంది. కథలో హీరో, హీరోయిన్ తొలిసారి కలుసుకొనే సీన్ ను లండన్ లోని లెయ్ సెస్టర్ ఏరియాలో చిత్రీకరించారు... ఇప్పుడు అదే ఏరియాలో హీరోహీరోయిన్లు షారుఖ్ ఖాన్, కాజోల్ కాంస్య విగ్రహాలను నెలకొల్పనున్నారట... ఇప్పటి దాకా లెయ్ సెస్టర్ స్క్వేర్ లో గ్రేటెస్ట్ ఇంగ్లిష్ మూవీస్ కు సంబంధించిన కొన్ని కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు... వాటిలో లారెల్ - హార్డీ, జీన్ కెల్లీ, మేరీ పాపిన్స్ వంటివారి బొమ్మలతో పాటు 'మిస్టర్ బీన్, హారీ పాటర్' లాంటి లెజెండ్స్ బ్రాంజ్ స్టాచ్యూస్ నెలకొల్పారు... ఆ విగ్రహాల సరసన 'దిల్ వాలే దుల్హనియా లే జాయంగే'లోని షారుఖ్ ఖాన్, కాజోల్ బొమ్మలు కూడా చోటుచేసుకోవడం విశేషం! ఓ ఇండియన్ సినిమాకు లెయ్ సెస్టర్ స్క్వేర్ లో ఈ గౌరవం లభించడం ఇదే మొదటి సారి.
ప్రఖ్యాత దర్శక నిర్మాత యశ్ చోప్రా (Yash Chopra) తన తనయుడు ఆదిత్య చోప్రా (Aditya Chopra) దర్శకత్వంలో 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' నిర్మించారు. 1995 బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ చిత్రం నిలచింది... ఈ సినిమాతో ఒక్కసారిగా షారుఖ్ ఖాన్ స్టార్ డమ్ నింగిని తాకింది. అంతటి ఘనచరిత్ర గల ఈ సినిమాకు లండన్ లో కాంస్య విగ్రహాలు ఆవిష్కరించడమే ఓ రికార్డ్! కాగా, అభిమానులకు ఆనందం పంచేందుకు మే 29 నుండి జూన్ 21 వరకు అంటే దాదాపు 24 రోజుల పాటు సంగీత కార్యక్రమం సాగనుంది. మాంచెస్టర్ ఒపెరా హౌస్ లో జరిగే ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ విశాల్ - శేఖర్ 18 ఒరిజినల్ సాంగ్స్ తో అలరించనుంది. నెల్ బెంజమిన్ లిరిక్స్ తో ఈ సంగీత విభావరి సాగనుంది. సిల్వర్ స్క్రీన్ నుండి బ్రాంజ్ స్టాచ్యూ దాకా వచ్చిన 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' ఇంకా ఏ యే తీరుల అలరిస్తుందో చూడాలి.
Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ
Also Read: Music Director : రథన్ దృష్టిలో అతను తండ్రి... ఇతను తల్లి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి