Vicky Kaushal: తొలి జీతం రూ. 1500.. మురిసిపోయిన క్షణాలు ఇప్పటికీ గుర్తే
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:24 PM
కత్రినా నాకు భార్యగా లభించడం నిజంగా నా అదృష్టం. తను నా జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నేను ఎంత కూల్‌గా ఉంటానో, తను అంత టెన్షన్ పార్టీ.
‘తౌబా తౌబా’ అంటూ తన స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేసిన విక్కీ కౌశల్(Vicky Kaushal)... ఈసారి ‘ఛావా’(Chhaava) సినిమా కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్‌గా మెప్పించేందుకు యుద్ధభూమిలోకి దిగాడు. ఈ సందర్భంగా ఆయన చెబుతున్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
ప్రొడక్షన్ బాయ్‌గా మొదలై...
మా నాన్న వాళ్లది పంజాబ్‌లోని ఓ పల్లెటూరు. ఉద్యోగాల కోసం నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా దొరకలేదు. విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. విషయం తెలుసుకున్న తాతయ్య మందలించి నాన్నను ముంబయికి పంపించారు. బతకడానికి నాన్న స్వీపర్‌గా పనిచేశారు. క్రమక్రమంగా బాలీవుడ్‌లో స్టంట్ కో-ఆర్డినేటర్ అయ్యారు. నాన్న వల్ల నాకు సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మొదట్లో ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేశా. నా తొలి జీతం రూ. 1500. ఆరోజు రాత్రి బాంద్రా స్టేషన్‌లో కూర్చుని, నా పేరు మీద రాసున్న చెక్‌ను చూస్తూ మురిసిపోయిన క్షణాలు ఇప్పటికీ గుర్తే.
నేనే ‘సారీ’ చెప్తా... (katrina kaif)
కత్రినా నాకు భార్యగా లభించడం నిజంగా నా అదృష్టం. తను నా జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నేను ఎంత కూల్‌గా ఉంటానో, తను అంత టెన్షన్ పార్టీ. అనవసరంగా చిన్న చిన్న విషయాలకు కంగారుపడిపోతుంది. అందుకే తనని ‘పానిక్ బటన్’ అని ముద్దుగా పిలుస్తుంటా. మా మధ్య చిన్న చిన్న గొడవలైతే నేనే మొదట ‘సారీ’ చెప్తాను. నా ఫోన్ వాల్‌పేపర్‌గా తన చిన్నప్పటి ఫొటోనే ఉంటుంది.
అడిగి మరీ ఆ పాత్ర చేశా...
‘డంకీ’లో చిన్న రోల్ చేయడం వెనుక ఓ కారణం ఉంది. మా నాన్న ఆ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ కావడంతో ఆయన ఒక రోజు సెట్‌లో సుఖీ (డంకీలో నా పాత్ర పేరు) పాత్రను ఎవరు పోషిస్తున్నారని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీని అడిగారట. ‘అది సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర. విక్కీ లాంటి వ్యక్తి అయితే బాగుంటుంది. కానీ చిన్న పాత్ర కావడం వల్ల తనని అడగలేక పోతున్నా’ అన్నారట. ఇంటికి రాగానే నాన్న ఆ విషయం నాతో చెప్పారు. వెంటనే నేను రాజ్ సార్‌కు ఫోన్ చేసి, ఆ పాత్ర నేనే చేస్తానని చెప్పాను. కథ కూడా వినకుండా అలా ఆ సినిమాలో భాగమయ్యా. ‘సంజు’ తర్వాత ఆయన తో నేను చేసిన రెండో సినిమా అది.
ఆ సంఘటన తలుచుకుంటే...
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. ఆ సినిమాలో ఇసుక అక్రమ తవ్వకాలను షూట్ చేయడం కోసం ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయా. ఇసుక స్మగ్లర్లు ఎంతోమంది ఉన్నారు. వారి అక్రమ ఇసుక రవాణాను రహస్యంగా షూట్ చేస్తుంటే తెలిసిపోయి, 500 మందిదాకా మమ్మల్ని చుట్టుముట్టారు. ముఠాకు చెందిన ఒక వ్యక్తి మా కెమెరామెన్‌ను కొట్టి, కెమెరా లాక్కున్నాడు. మాపై దాడి చేయబోతుంటే అక్కడ నుంచి పారిపోయాం. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది.
హృతిక్‌కు వీరాభిమానిని (Hrithik Roshan)
నేను హృతిక్ రోషన్‌కు వీరాభిమానిని. చిన్నప్పుడు టీవీలో ఆయన డ్యాన్స్‌లు చూస్తూ అచ్చంగా అలాగే హుక్ స్టెప్స్ వేస్తుండేవాడిని. అప్పటికీ, ఇప్పటికీ ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అబుదాబిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనతో కలసి స్టేజ్ షేర్ చేసుకోవడం, ‘ఏక్ పల్ కా జీనా’ పాటకు డ్యాన్స్ చేయడం నాకు ఫ్యాన్ మూమెంట్ అనే చెప్పాలి. నా ‘తౌబా తౌబా’ పాట విడుదలయ్యాక ‘నీ డ్యాన్స్ స్టైల్ మామూలుగా లేదుగా’ అంటూ హృతిక్ నన్ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను.
అరుదైన అవకాశం
శంభాజీ మహారాజ్ (Shambaji Maharaj) లాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వరిస్తుంది. ‘ఛావా’ (Chhavva)సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డాను. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకున్నా. వీటన్నింటి కన్నా ముఖ్యంగా శంభాజీ మహారాజ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, ఆ పాత్రకు తగ్గట్టుగా మానసికంగా సన్నద్ధం కావడం సవాలుగా అనిపించింది. ఇలాంటి యోఽధుడి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు గర్వంగా ఉంది.