Pahalgam: పాకిస్తానీ హీరో చిత్రానికి బాయ్ కాట్ సెగ...
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:06 PM
ఫవద్ ఖాన్, వాణీకపూర్ జంటగా నటించిన 'అబిర్ గులాల్' సినిమాపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తానీ హీరో నటించిన ఆ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని సామెత. పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి ఇప్పుడో సినిమా మెడకు చుట్టుకుంది. మే 9వ తేదీ విడుదల కాబోతున్న 'అబిర్ గులాల్' (Abir Gulaal) సినిమాను బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తుంటే... మరికొందరు బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు... ఈ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవద్ ఖాన్ (Fahad Khan) హీరోగా నటించాడు. వాణీ కపూర్ (Vaani Kapoor) హీరోయిన్ గా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మే 9న విడుదల కాబోతున్న సందర్భంగా ఇటీవల చిత్ర బృందం దుబాయ్ లో కూడా ప్రచారాన్ని చేసింది.
తాజాగా పహల్గామ్ పాక్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు హిందూ పర్యాటకులపై దాడి చేసి 26 మంది హతమార్చడంతో దేశవ్యాప్తంగా నిరసలను మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫవద్ ఖాన్ నటించిన సినిమాను ఎందుకు భారత్ లో ప్రదర్శించాలనే వాదన మొదలైంది. నిజానికి కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలోని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఆడనివ్వమని అల్టిమేటమ్ జారీ చేసింది. కొన్నేళ్ళుగా ఎం.ఎన్.ఎస్. పార్టీ పాకిస్తానీ నటీనటులు భారతీయ చిత్రాలలో నటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాటిని ప్రదర్శించనివ్వకుండా అడ్డుకుంటోంది. అందులో భాగంగా ఫవద్ ఖాన్ నటించిన 'అబిర్ గులాల్' మీద కూడా నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడంతో ఆ నిరసన మరింత తీవ్రరూపం దాల్చింది.
చిత్రం ఏమంటే... ఫహద్ ఖాన్ కు ఈ తరహా సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. పాకిస్తాన్ కు చెందిన అతను గత కొన్నేళ్ళుగా హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. 2016లో ఉరి అటాక్ (Uri Attack) జరిగిన నెల రోజుల తర్వాత 'ఎ దిల్ హై ముష్కిల్' (Ae Dil Hai Mushkil) సినిమా విడుదలైంది. ఆ సినిమాలోనూ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అనుష్క శర్మ (Anushka Sharma), ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) తో పాటు ఫవద్ ఖాన్ నటించాడు. దాంతో ఆ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటే కొందరు డిమాండ్ చేశారు. అలానే ఇప్పుడు 'అబిర్ గులాల్' విడుదలకు పది రోజుల ముందు పహల్గామ్ దాడి జరిగింది. ఫవద్ ఖాన్ సినిమాలకే పాపం ఇలా ఎందుకు అవుతోందో అని కొందరు జాలి చూపిస్తున్నారు. ఏదేమైనా... ఇలాంటి సమయాలలో పాకిస్తాన్ నటీనటుల సినిమాలపై భారతీయులు గుర్రుగా ఉండటం సహజమే.
Also Read: Emergency: కంగనాపై కోర్టు కెక్కిన రచయిత్రి
Also Read: Super Star: సితారతో మహేశ్... ఆ గ్రేసే వేరు....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి